- ఘటన జరగ్గానే వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడమే హనుమాన్ ఉద్ధేశ్యం..
- ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జంతు ప్రేమికులకు శుభాకాంక్షలు..
Pawan Kalyan Speech: వన్యప్రాణి సంఘర్షణను ‘కాన్ఫ్లిక్ట్’ నుంచి ‘కో-లివింగ్’ వైపు మలచడం హనుమాన్ ప్రాజెక్టు ముఖ్యఉద్ధేశ్యమని ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో ఏనుగులు, ఇతర వన్యప్రాణులు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజల ప్రాణాలకు, పంటలకు కలిగిస్తున్న ఇబ్బందులను శాస్త్రీయంగా, సాంకేతికంగా పరిష్కరించాలనే ఆలోచనతోనే “హనుమాన్” ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు.
సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, పంటలు, పశువులు, ఆస్తులు, ప్రాణాలకు భద్రత, వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేయడం, సంఘర్షణ జరిగిన వెంటనే వేగవంతమైన స్పందన అటవీ శాఖ ఇతర శాఖలైన పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమగ్ర విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 వాహనాల ప్రారంభించామని, 93 రాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వాహనాలతోపాటు, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సులు ఉన్నాయన్నారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, 19 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఏర్పాటు చేసామన్నారు. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ అధికారి, జంతు వైద్య సిబ్బంది, పారా వెటర్నరీయన్లు, గిరిజన సహాయకులు ఉంటారన్నారు.
విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరూట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ & ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు. గ్రామ స్థాయిలో “వన్యజీవి రక్షకులు” నియామకం, శిక్షణ, రెస్క్యూ కిట్లు అందిస్తున్నామన్నారు. 2025–26లో 2,107 కేసులు నమోదు కాగా దాదాపు ₹4 కోట్ల పరిహారం చెల్లింపు చేసామన్నారు. దురదృష్టవశాత్తు మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియా ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచామన్నారు. వన్యప్రాణుల దాడిలో గాయపడిన వారికి ₹2 లక్షల పరిహారం చెల్లిస్తున్నామన్నారు. పశువుల నష్టానికి మార్కెట్ విలువ ఆధారంగా చెల్లింపు చేస్తున్నారన్నారు. కర్ణాటక ప్రభుత్వ సహకారంతో 4 కుంకీ ఏనుగుల వినియోగిస్తున్నామని, ఇప్పటివరకు 8 ఆపరేషన్లు విజయవంతం అయ్యాయన్నారు. ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థతోపాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మెసేజింగ్ అలర్ట్ వ్యవస్థ, అడ్వాన్స్ డ్ వెదర్ & అలర్ట్ రిపోర్టింగ్ వ్యవస్థ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా ప్రభుత్వం వినియోగించుకుంటోందన్నారు.. వన్యప్రాణి సంఘర్షణను ‘కాన్ఫ్లిక్ట్’ నుంచి ‘కో-లివింగ్’ వైపు మలచడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. “భూమి మనిషికే కాదు, జంతువులకు కూడా సొంతం” అనే ‘వసుధైక కుటుంబం’ భావనతో ఈ కార్యక్రమం రాష్ట్రంలో అమలు అవుతుందని తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది మరియు స్వచ్ఛంద సంస్థల సేవలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. “కలిసి జీవిద్దాం – కలిసి బతుకుదాం” అనే సందేశంతో ప్రారంభమైన “ప్రాజెక్ట్ హనుమాన్” రాష్ట్రంలో మానవ–వన్యప్రాణి సహజీవనానికి మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తుందని ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వన్యప్రాణుల రక్షణతో పాటు మానవ ప్రాణ నష్ట నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. “హనుమాన్” పథకం ద్వారా వన్యప్రాణి–మానవ సహజీవనానికి కొత్త దిశను అందిస్తూ, రాష్ట్రాన్ని వన్యప్రాణి సంరక్షణలో ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
మానవ–వన్యప్రాణి సంఘర్షణలను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో “ప్రాజెక్ట్ హనుమాన్” (Healing and Nurturing Units for Monitoring, Aid and Nurturing) కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఘనంగా మంగళగిరిలో ప్రారంభించారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలో మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ... వన్యప్రాణి సంరక్షణా దినోత్సవం సందర్భంగా “హనుమాన్” కార్యక్రమం ప్రారంభం కావటం శుభసూచకమన్నారు. వన్యప్రాణి సంరక్షణా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అమృత హస్తాలతో “హనుమాన్” అనే వినూత్న వన్యప్రాణి సంరక్షణ మరియు ఘర్షణ నివారణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అటవీ శాఖ వినూత్న కార్యక్రమాలకు వేదికవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఏనుగుల నుంచి పంట, ప్రాణ నష్టాలను కాపాడేందుకు కర్నాటక నుంచి తెచ్చిన కుంకీ ఏనుగుల నిర్వహణ, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం సంరక్షణ చర్యలు, రాజమహేంద్రవరంలో అటవీ పరిశోధన సంస్థ కార్యక్రమాలు వంటి అనేక చర్యల ద్వారా అటవీ శాఖ ప్రజలకు చేరువ చేసిన ఘనత ఉపముఖ్యమంత్రి వారిదేనని పేర్కొన్నారు. మానవ–వన్యప్రాణి ఘర్షణ తగ్గింపే లక్ష్యం మానవ జీవన విధానం, వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించడానికి శాస్త్ర సాంకేతిక ఆధారిత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వన్యప్రాణుల వల్ల పంటలు, ఆస్తులకు కలిగే నష్టాన్ని తగ్గించడంతో పాటు, అదే సమయంలో వన్యప్రాణుల సంరక్షణను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. “హనుమాన్” కార్యక్రమం ద్వారా వన్యప్రాణులను జనసంచారం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రజల ప్రాణాలు, పంటలు, ఆస్తులను రక్షించడం వేగవంతమైన రెస్క్యూ & రిలీఫ్ చర్యలు చేపట్టడం అనే ద్వంద్వ లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమం కేవలం అటవీ శాఖకే పరిమితం కాదని, వ్యవసాయ, పశుసంవర్ధక, పర్యాటక మరియు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్లు సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని, స్థానిక సమాజం మరియు స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగుతామని చెప్పారు. ప్రజల్లో చైతన్యం అవసరం అని, మానవులు, వన్యప్రాణులు ఒకరినొకరు భయపడే పరిస్థితి రాకుండా, పరస్పర అవగాహనతో సహజీవనం చేయాలనే భావనను “హనుమాన్” కార్యక్రమం బలపరుస్తుందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగుతుందన్నారు. వన్యప్రాణి సంరక్షణ, ప్రజల భద్రత, శాస్త్రీయ పర్యవేక్షణ, సమగ్ర పరిపాలన అనే నాలుగు స్తంభాలపై “హనుమాన్” కార్యక్రమం నిలుస్తుందని, ఇది రాష్ట్రాన్ని వన్యప్రాణి నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలబెడుతుందని మంత్రి కందుల దుర్గేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఈఎఫ్ఎస్ అండ్ టీ డిపార్ట్ మెంట్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ... హనుమాన్ (HANUMAN) పథకం ప్రారంభం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే (World Wildlife Day) సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి 'హనుమాన్' (HANUMAN) అని పేరు పెట్టారు. హ్యూమన్-యానిమల్ కాన్ఫ్లిక్ట్ (Man-Animal Conflict) ను అరికట్టేందుకు రాష్ట్రంలో అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టం, పంట నష్టాన్ని నివారించడానికే హనుమాన్ చేపట్టామన్నరు. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారన్నారు. గతంలో ఉన్న పరిహారాన్ని ప్రభుత్వం సవరించి పెంచిందన్నారు. ప్రాణ నష్టం జరిగినప్పుడు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచింది. నష్టం జరిగిన 24 గంటల్లోనే బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. 'గజ ప్రజా', 'సర్ప మిత్ర' వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వన్యప్రాణుల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి 23 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేశారన్నారు. అటవీ శాఖ కోసం 81 కొత్త వాహనాలను ప్రారంభించారన్నారు. వన్యప్రాణుల కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలు, ట్రాంక్విలైజర్స్ కలిగిన 4 ప్రత్యేక వైల్డ్ లైఫ్ అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. జంతువుల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడానికి, ఏనుగులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని తిరిగి అడవిలోకి పంపడానికి ప్రత్యేకమైన సౌండ్ సిస్టమ్స్, టెక్నాలజీని వాడుతున్నారన్నారు.
చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ మరియు అటవీ శాఖ అధిపతి పీవీ చలపతిరావు మాట్లాడుతూ... ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం “హనుమాన్ (Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife)” పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో వన్యప్రాణులు, మానవుల మధ్య పెరుగుతున్న ఘర్షణలు (Human-Animal Conflict) కారణంగా పంట నష్టం, పశువుల నష్టం మరియు ప్రాణ నష్టం సంభవిస్తున్న పరిస్థితిని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల రక్షణతో పాటు ప్రజలకు కలిగే నష్టాన్ని తగ్గించే దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా “హనుమాన్” పథకం రూపుదిద్దుకుంది. వన్యప్రాణుల సంరక్షణ, మానవ ప్రాణ మరియు ఆస్తి రక్షణ, పంట నష్టం తగ్గింపు, ప్రజల్లో వన్యప్రాణుల పట్ల అవగాహన పెంపు వంటి చర్యలతోపాటు ప్రాణ నష్టం జరిగిన సందర్భాల్లో ఇచ్చే పరిహారాన్ని ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచామన్నారు. నష్టపరిహారాన్ని బాధితులకు 24 గంటలలోపు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ‘గజ ప్రజా’, ‘సర్ప మిత్ర’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామన్నారు. సాంకేతికత, మౌలిక సదుపాయాలు రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను రాష్ట్రవ్యాప్తంగా 23 యూనిట్లు సిద్ధంగా ఉంచామన్నారు. దాదాపు సుమారు 81 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వైల్డ్‌లైఫ్ అంబులెన్సులు అయిన అత్యవసర చికిత్స, ట్రాంక్విలైజేషన్, వన్యప్రాణుల సురక్షిత తరలింపు కోసం 4 ప్రత్యేక అంబులెన్సులను సిద్ధం చేశామన్నారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా వన్యప్రాణుల కదలికలను నిరంతరం గమనిస్తూ, అవి జనావాసాల్లోకి రాకుండా శబ్ద తరంగాల సాంకేతికత (Sound Technology) సహాయంతో అడవుల వైపు మళ్లించే చర్యలు చేపడుతున్నామన్నారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హనుమాన్ డిజిటల్ యాప్ ను, జీపీఫ్ ట్రాకింగ్ సిస్టమ్స్ ను, దాదాపు 100 వివిధ ఫారెస్ట్ వాహనాలు, అంబులెన్స్ లను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి, అధికారులతో కలిసి ప్రారంభించారు.. అనంతరం వివిధ విభాగాల్లో సేవలు అందించిన అధికారులకు, ఎన్జీవో లకు సర్టిఫికెట్స్ అందించారు... తొలుత గార్డ్స్ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గౌరవ వందనం స్వీకరించారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ మరియు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా, అడ్వైజర్ (పారెస్ట్ డిపార్ట్ మెంట్ యాక్టివిటీస్) పి. మల్లిఖార్జునరావు, అడిషనల్ పీసీసీఎఫ్ (CAMPA & FCA) రాహుల్ పాండే, పంచాయతీ రాజ్ & రూరల్ డవలప్ మెంట్ కమిషనర్ కృష్ణ తేజ, ఎంసీఏ అడ్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్) పి. నాగేశ్వరరావు, అడ్వైజర్ కొమెర అంకారావు, హనుమాన్ ప్రాజెక్ట్ సమన్వయకర్త నందిని సలారియా, వివిధ జిల్లాలకు చెందిన కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్స్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్స్, రేంజ్ ఆఫీసర్స్, తదితరలు పాల్గొన్నారు.