Telangana Budget 2026: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం అసెంబ్లీ వేదికగా సుమారు రూ.3.26 లక్షల కోట్ల భారీ వ్యయంతో ఈ పద్దును ప్రైవేటు చేయనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులు మరింత పెరగడం విశేషం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 'ఆరు గ్యారంటీలు', ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది.
ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా మూడు రంగాలకు పెద్దపీట వేయనుంది. అవే సంక్షేమం, వ్యవసాయం నీటి పారుదల. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 'రైతు భరోసా', 'రైతు బీమా'తో పాటు సన్న వడ్లకు బోనస్ ఇచ్చేందుకు భారీగా నిధులు కేటాయించనున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, కొత్తగా భూసేకరణ చేపట్టేందుకు దాదాపు రూ.5 వేల కోట్లను కేటాయించే అవకాశం ఉంది. తుమ్మిడిహెట్టి, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత దక్కనుంది.
విద్యార్థినులు, నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ బడ్జెట్‌లో తీపి కబురు అందనుంది. కాలేజీకి వెళ్లే యువతులకు హామీ ఇచ్చిన విధంగా ఈవీ స్కూటర్ల పంపిణీకి నిధులు కేటాయించబోతున్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ కొత్త స్కిల్ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటుకు నిధులు ఇవ్వనున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ (PRC) అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల కోసం ప్రత్యేకంగా నిధులను సర్దుబాటు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉంది. మూసీ నది పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో రెండో దశ విస్తరణ వంటి మెగా ప్రాజెక్టులకు ఈ పద్దులో భారీగా నిధులు అందనున్నాయి. వీటితో పాటు 'తెలంగాణ విజన్-2047' డాక్యుమెంట్ అమలుకు పునాది పడనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, రాష్ట్ర సొంత ఆదాయం పెరగడం వల్ల ఈ భారీ బడ్జెట్‌ను అమలు చేయడం సాధ్యమేనని ఆర్థిక శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతారు. అదే సమయంలో శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెడతారు. మొత్తానికి పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఈసారి తెలంగాణ బడ్జెట్ ఉండబోతోంది.