గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ కూటమి ప్రభుత్వ ధ్యేయం..
వచ్చే 3 నెలల్లో 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు పూర్తిచేస్తాం..
రాచర్లలో విద్యుత్ రంగానికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం, ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సబ్‌స్టేషన్‌ను 2019లోనే ప్రారంభించినప్పటికీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తి కాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేసి సబ్‌స్టేషన్‌ను పూర్తిచేశామని తెలిపారు.
రాష్ట్రంలో గృహ వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.
ఇక సౌరశక్తి వినియోగంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, వచ్చే మూడు నెలల్లో 6 లక్షల పీఎం సూర్యఘర్ పథకం కనెక్షన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ఈ సబ్‌స్టేషన్ ప్రారంభంతో రాచర్ల పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు, వ్యవసాయం, పరిశ్రమలకు కూడా ఉపయోగం చేకూరనుంది. స్థానికులు ఈ అభివృద్ధిని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.