విశాఖలో రూ. 100 కోట్లతో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్..
పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్..
అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశం..
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తోందని, దీనిని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ రంగాన్ని రాష్ట్రానికి “గ్రోత్ ఇంజిన్”గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
సీఎం సమీక్షకు ముందస్తు సమావేశం
బుధవారం జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నేపథ్యంలో, మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి దుర్గేష్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
15 ఏళ్ల ఆర్థిక ప్రణాళికపై చర్చ
రాబోయే 15 ఏళ్లకు సంబంధించి ఏపీటిడీసీ ఆర్థిక ప్రణాళికపై సమగ్రంగా చర్చ జరిగింది. కొత్త పెట్టుబడులు, హోటల్స్, హాస్పిటాలిటీ ప్రాజెక్టులు, ఎస్‌ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులు, హోమ్‌స్టేలు, కేంద్ర నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి—అన్నీ అంశాలను సమీక్షించారు.
‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్ లక్ష్యం
గోదావరి పుష్కరాల నాటికి ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పర్యాటకుల సంఖ్య పెంచేందుకు వినూత్న ఆలోచనలు తీసుకురావాలని సూచించారు.
రాష్ట్రంలో బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, క్రియేటివ్ ఎకానమీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం చేశారు.
విశాఖలో భారీ ప్రాజెక్ట్
ఇక విశాఖపట్నంలో భారీ పెట్టుబడులతో కొత్త ప్రాజెక్ట్‌కు రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మంత్రి దుర్గేష్‌ను కలిశారు. వీఎంఆర్డీఏ పరిధిలో సుమారు రూ.100 కోట్లతో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌కు అనువైన స్థలాలను ఇప్పటికే గుర్తించినట్లు, పర్యాటక శాఖ నుంచి తగిన మార్గదర్శకత్వం లభించిందని ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
పెట్టుబడులకు ప్రభుత్వం హామీ
పర్యాటక రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
ఈ ప్రాజెక్టులు స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047 లో భాగంగా అమలు అవుతున్నాయని మంత్రి వివరించారు. వినోద రంగాన్ని పర్యాటక వృద్ధికి ప్రధానంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈడీలు పద్మావతి, శేషగిరిరావు, ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, సిఎంఓ పద్మారాణి సీలా, ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్ సత్యప్రభ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెరగడం, కొత్త ప్రాజెక్టులు ముందుకు రావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనున్నాయి. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.