- జెట్ స్పీడ్ తో విగ్రహ ఏర్పాటు పూర్తిచేసిన ట్రస్ట్ సభ్యులను అభినందించిన మంత్రి…
- అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబం, ట్రస్ట్ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు…
Amaravati Nara Lokesh: రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అనంతరం రాత్రి ఉండవల్లి నివాసంలో పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. అమరజీవి త్యాగశిల్పం చాలా బాగుందని ఈ సందర్భంగా మంత్రి కితాబిచ్చారు. అమరావతి శాఖమూరు పార్క్ లో జెట్ స్పీడ్ తో 194 రోజుల్లోనే కాంస్య విగ్రహ ఏర్పాటు పూర్తిచేయడంతో పాటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం విజయవంతం పట్ల పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ట్రస్ట్ ఛైర్మన్ డూండి రాకేష్ ను శాలువా, ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటాం
ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం విజయవంతంగా జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం చాలా కళగా ఉంది. రికార్డ్ సమయంలో విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన ప్రతిఒక్కరికి అభినందనలు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు. కార్యక్రమం విజయవంతం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. యువగళం పాదయాత్ర సమయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్వగ్రామానికి వెళ్లి స్ఫూర్తి పొందాను. పొట్టి శ్రీరాములు చరిత్ర, త్యాగనిరతిని భావితరాలకు తెలియజేయాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన త్యాగం, పోరాటం వెలకట్టలేనివి. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతాం. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. 12 నెలల్లోనే స్మృతివనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మాణం పూర్తిచేయాలి. రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. ఆత్మీయ విందు సమావేశం ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగింది. మంత్రి లోకేష్ ప్రతిఒక్కరినీ పేరుపేరునా పలకరించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అమరజీవి పొట్టి శ్రీరాములు మనవరాలు రేవతి తంగుడు, అనురాధ దేవకి, మునిమనవరాళ్లు, మునిమనవళ్లు వసుధ, అమర్, అజయ్, కుందా ప్రతిభ, కుందా ప్రతాప్ తో పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.