LPG Stock AP: గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులు, సామాన్యుడిపై దాని ప్రభావం పడకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో వంట గ్యాస్ (LPG) సరఫరా, నిల్వలు బుకింగ్ ప్రక్రియపై ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్యాస్ కంపెనీల ప్రతినిధులు పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 17,209 టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉంది. ఈ స్టాక్‌ను వినియోగదారులకు సక్రమంగా చేరవేయాలని, 1,154 ఏజెన్సీల ద్వారా నిరంతరం సరఫరా జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయనే ఫిర్యాదులపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. డెలివరీ సమయంలో ఎక్కడా దుర్వినియోగం జరగకూడదని, అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని, సామాన్యులు గందరగోళానికి గురికాకుండా పారదర్శకత పాటించాలని సూచించారు.
సంక్షేమ పథకాలు ప్రజోపయోగ సంస్థలపై గ్యాస్ కొరత ప్రభావం పడకుండా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల కిచెన్లకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఆస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలలు ఆలయాల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి, అక్కడ ఇంధన కొరత రాకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు.
గ్యాస్ సరఫరా సమయాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావాలని సీఎం కంపెనీల ప్రతినిధులను కోరారు. నిత్యం స్టాక్ పొజిషన్‌ను పర్యవేక్షించాలని, ప్రజల్లో ఎలాంటి ఆందోళన కలగకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను తెలియజేయాలని చెప్పారు. ప్రజల అవసరాలే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతని, ఏ ఒక్కరూ గ్యాస్ కోసం ఇబ్బంది పడకూడదని ఈ సమావేశం ద్వారా తెలిపారు.