Middle East Crisis: గల్ఫ్ ప్రాంతంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం, ముఖ్యంగా ఇరాన్ రేవులపై అమెరికా దిగ్బంధనం విధిస్తున్న తరుణంలో ఆయన కువైట్, సింగపూర్ విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల్లో ప్రధానంగా అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రత, ప్రాంతీయ శాంతిపై సుదీర్ఘంగా చర్చించారు.
కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జబర్ అల్-అహ్మద్ అల్-సబాతో జైశంకర్ జరిపిన సంభాషణలో.. కువైట్‌లో ఉన్న లక్షలాది మంది భారతీయ కార్మికుల సంక్షేమం గురించి ఆరా తీశారు. యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ మనవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. అనంతరం "కువైట్ మంత్రితో మంచి చర్చలు జరిగాయి. ప్రాంతీయ పరిస్థితులతో పాటు మన భారతీయుల క్షేమం గురించి మాట్లాడుకున్నాం" అని జైశంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మరోవైపు సింగపూర్ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో కూడా జైశంకర్ మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం వల్ల ప్రపంచ వాణిజ్యంపై పడే ప్రభావం గురించి వీరు చర్చించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవుల్లోకి ఏ నౌక వెళ్లకుండా, బయటకు రాకుండా అమెరికా సైన్యం దిగ్బంధనం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్త చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న 'హార్ముజ్ జలసంధి'పై ఈ ఆంక్షలు అమలులోకి రావడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది.
అమెరికా చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతున్నాయి. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరుకుంది. భారత్‌లో కూడా బంగారం, వెండి ధరలు చుక్కలనంటుతున్నాయి. బంగారం సుమారు 1.55 లక్షలకు చేరగా, వెండి కేజీ 2.47 లక్షలకు పెరగడం సామాన్యులను భయపెడుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల ఉపాధిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.