Machilipatnam News: పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. సోమవారం మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని రుద్రవరంలో నిర్మించిన జి+3 టిడ్కో ఇళ్లను జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావులతో కలిసి ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇళ్ల తాళాలను పంపిణీ చేసిన మంత్రి, అధికారులతో కలిసి గృహ సముదాయాలను పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు.
గత ఐదేళ్ల పాలనలో పేదలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కేవలం రంగులు వేస్తూ కాలక్షేపం చేసిందే తప్ప, ఇళ్లు పూర్తి చేసి పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి, అర్హులకు ఇళ్లను అప్పగిస్తున్నామని చెప్పారు. మచిలీపట్నంలోని ప్రతి పేద కుటుంబానికి ఒక గూడు ఉండాలన్నదే తన ఆశయమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పేదల కష్టాలను తాను దగ్గరుండి చూశానని మంత్రి రవీంద్ర గుర్తు చేసుకున్నారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ఎవరైనా మరణిస్తే, వారి మృతదేహాలను ఇంట్లోకి రానివ్వని అమానవీయ ఘటనలు చూసి తన మనసు చలించిందని భావోద్వేగంతో చెప్పారు. కొందరు పేదలు శ్మశానాల్లో కూడా ఉండేందుకు సిద్ధపడటం తనను కదిలించిందని, అందుకే కోనేరు సెంటర్ వద్ద ధర్నా చేసి మరీ దరఖాస్తులు సేకరించామని తెలిపారు. ఇప్పుడు గోసంఘం వద్ద 864, రుద్రవరంలో 1440 ఇళ్లను పంపిణీ చేయడం ద్వారా ఆ మాట నిలబెట్టుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.
అభివృద్ధి కేవలం ఇళ్లకే పరిమితం కాదని, ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రజల భద్రత కోసం కంపౌండ్ వాల్ నిర్మించి, సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో ప్రజల్లో ఆనందం కనిపిస్తోందని చెప్పారు.
మంత్రి మాట్లాడుతూ... గతంలో నిలిచిపోయిన మరో 1800 ఇళ్ల పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అర్హత ఉండి ఇళ్లు రాని వారెవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గా ప్రసాద్, టీడీపీ నేతలు గొర్రెపాటి గోపిచంద్, గోపి సత్యన్నారాయణ ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు