వెలిగొండ ప్రాజెక్టుకు కీలక మైలురాయి..
గంటవానిపల్లెలో ఫీడర్ కాలువకు సీఎం శంకుస్థాపన!
రైతుల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా అడుగు..
Chandrababu Interacts with Farmers:ప్రకాశం జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దోర్నాల మండలం గంటవానిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి, వెలిగొండ ఫీడర్ కాలువ పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో కాలువ పనులను పరిశీలించి, అక్కడి భౌగోళిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతం అరటి, బొప్పాయి వంటి వాణిజ్య పంటల సాగుకు ఎంతో అనుకూలమని రైతులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎంకు, పనుల వేగం గురించి ఇంజనీర్లు కీలక వివరాలు వెల్లడించారు. సుమారు 11,580 క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్థ్యంతో ఈ ఫీడర్ కాలువను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే మే నెల చివరి నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. కేవలం 45 రోజుల్లోనే 45 టీఎంసీల నీటిని డ్రా చేసి, నల్లమలసాగర్‌ను పూర్తిగా నింపేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కాలువను చారిత్రక కంబం చెరువుకు కూడా అనుసంధానించినట్లు అధికారులు వివరించారు. దీనివల్ల ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు జలకళ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే కేవలం ప్రధాన కాలువలే కాకుండా, స్థానికంగా ఉన్న చిన్న చిన్న చెరువులను కూడా నింపేలా అవసరమైన నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ నీటి ఫలాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, పోరుమామిళ్ల, రాచర్ల వంటి దూర ప్రాంతాలకు కూడా చేరేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి ఎకరాకు నీరు అందడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ హెలికాప్టర్ ద్వారా నల్లమలసాగర్ ఫీడర్ కెనాల్‌ను నిశితంగా పరిశీలించి, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని హెచ్చరించారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, వలసలు ఆగిపోతాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో పనుల్లో వేగం పెరుగుతుందని, వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. జిల్లా యంత్రాంగం కూడా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.