AP GENCO Record Production: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ జెన్కో తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక విద్యుత్ ఉత్పత్తిని సాధించి రికార్డు సృష్టించింది. గురువారం నాడు ఏకంగా 6160 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, తన పాత రికార్డులన్నింటినీ చెరిపివేసింది. ఈ అసాధారణ విజయంపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ రికార్డు స్థాయి ఉత్పత్తిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెన్కో అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆయన పేరుపేరునా అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆయన ఇచ్చిన సలహాలు ఈ విజయానికి ప్రధాన కారణమని మంత్రి పేర్కొన్నారు. జెన్కో స్థాపించిన నాటి నుండి ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి కావడం ఇదే తొలిసారి అని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తి మాత్రమే కాకుండా, 5730 మెగావాట్ల ఎక్స్-బస్ సరఫరాను కూడా విజయవంతంగా అందించినట్లు వివరించారు.
రాబోయే ఎండాకాలం దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. "ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో వేసవిలో ఎండలు ముదిరే అవకాశం ఉంది. విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. దానికి అనుగుణంగా అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి" అని మంత్రి ఆదేశించారు. ఇళ్లు, వ్యాపారాలు, పరిశ్రమలు.. ఇలా ఏ రంగానికి కూడా కరెంట్ కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయడమే తమ ముందున్న టాస్క్ అని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఏపీ జెన్కోను నిర్వీర్యం చేశారని, ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరలకు కరెంట్ కొని ప్రజలపై రూ. 32 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. జగన్ హయాంలో ఏకంగా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వినియోగదారులపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 13 పైసల 'ట్రూ డౌన్' అమలు చేసి ప్రజలకు ఊరటనిచ్చామన్నారు. కరెంట్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వందలాది కొత్త సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని, కొత్త లైన్లు వేస్తున్నామని తెలిపారు. కేవలం విద్యుత్ ఉత్పత్తి పెంచడమే కాకుండా, పంపిణీ వ్యవస్థలో లోపాలు లేకుండా చూస్తున్నామని చెప్పుకొచ్చారు.