Houston TCA News: అమెరికాలోని ప్రముఖ ప్రవాసాంధ్ర సంస్థ, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తన ప్రయాణంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. 1976లో ప్రారంభమైన ఈ సంస్థ, 2026 నాటికి 50 ఏళ్ల ఘనమైన చరిత్రను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ వేడుకల్లోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రాత్మక సందర్భంలోనే 2026-27 సంవత్సరానికి సంబంధించి నూతన ఎగ్జిక్యూటివ్ బోర్డు ట్రస్టీల వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించింది.
గత ఐదు దశాబ్దాలుగా హ్యూస్టన్ నగరంలో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో TCA అగ్రగామిగా నిలుస్తోంది. పరాయి దేశంలో ఉన్నా మన మూలాలను మర్చిపోకుండా, తెలుగు వారిని ఏకం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ 50 ఏళ్ల కాలంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులు సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
ఈ స్వర్ణోత్సవ ఏడాదిని మరింత గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు సరికొత్త ఉత్సాహంతో నూతన నాయకత్వం బాధ్యతలు చేపట్టింది. TCA అధ్యక్షుడిగా యాదగిరి రెడ్డి కుడుముల బాధ్యతలు స్వీకరించారు. జనరల్ సెక్రటరీగా రామకృష్ణ గొడవర్తి, కోశాధికారిగా జయశ్రీ బొందు నియమితులయ్యారు. ఈ కొత్త టీమ్ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
వివిధ విభాగాల్లో సేవలందించే వారు వీరే..
సంస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ విభాగాలకు ప్రతినిధులను ఎంపిక చేశారు:
కల్చరల్ సెక్రటరీ: స్నేహలత చిర్ర
వెబ్ - కమ్యూనికేషన్స్: వాణి దూడల
లిటరసీ సెక్రటరీ: మైథిలి చాగంటి
స్పోర్ట్స్ - స్పెషల్ ప్రాజెక్ట్స్: నగేష్ సూరెడ్డి వీరితో పాటు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా దామోదర్‌రెడ్డి జమిలి, ఉష రంగరాజ్, ఆశాజ్యోతి దేవకీ బాధ్యతలు చేపట్టారు.
మన సంస్కృతి-మన ఆత్మ-మన భాష-మన గౌరవం" అనే నినాదంతో ఈ ఏడాది వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించాలని నూతన బోర్డు సంకల్పించింది. అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలకు మన భాషపై మక్కువ పెంచేలా, అలాగే ఇక్కడ ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ స్వర్ణోత్సవ ఏడాది TCA చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దుతామని నూతన అధ్యక్షులు యాదగిరి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.