Rampachodavaram News: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక గిరిజన గ్రామంలో మానవత్వం చాటి చెప్పింది. రహదారి సౌకర్యం లేని మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక గర్భిణిని కాపాడేందుకు 108 సిబ్బంది చేసిన సాహసం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కొండలు వాగులు దాటుకుంటూ వెళ్లి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రంపచోడవరం మండలం బీ.రామన్నపాలెం గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
అంబులెన్స్ వెళ్లలేని చోట..
బీ.రామన్నపాలెం గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళకు హఠాత్తుగా ప్రసవ వేదన మొదలైంది. ఊరికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లడం పెద్ద సవాలుగా మారింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అత్యవసర సేవలకు ఫోన్ చేశారు. సమాచారం అందిన వెంటనే రంపచోడవరం నుంచి అంబులెన్స్ బయలుదేరింది. అయితే, గ్రామానికి 2 కిలోమీటర్ల ముందే రోడ్డు ఆగిపోయింది. అటుపై అంతా రాళ్లు, రప్పలు, ఎగుడుదిగుడు మార్గం కావడంతో వాహనం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
భుజాన మోస్తూ.. రెండు కిలోమీటర్ల ప్రయాణం
సమయం మించిపోతుండటంతో 108 ఈ.ఎమ్.టి పైలట్ ఏమాత్రం ఆలోచించలేదు. అంబులెన్స్‌లో ఉన్న స్ట్రెచర్‌ను తీసుకుని కాలినడకన అడవి బాట పట్టారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర కొండలు, వాగులు దాటుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆ గర్భిణిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి, అత్యంత చాకచక్యంగా భుజాలపై మోస్తూ తిరిగి అంబులెన్స్ ఉన్న చోటికి తీసుకువచ్చారు. ఎండను కూడా లెక్కచేయకుండా వారు చూపిన చొరవ స్థానికులను అబ్బురపరిచింది.
సురక్షితంగా ఆసుపత్రికి.. ప్రాణం నిలబెట్టిన వైనం
అంబులెన్స్‌లోకి చేర్చిన వెంటనే సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అత్యంత వేగంగా వాహనాన్ని నడిపి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి ఆమెకు కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో వైద్య సేవలు అందడం వల్లే ఆ మహిళ ప్రాణాలు దక్కాయని బాధితురాలి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
సేవలో తృప్తి.. అధికారుల ప్రశంసలు
మా కష్టం ఒక ప్రాణాన్ని కాపాడిందనే తృప్తి మాకు చాలు అని 108 సిబ్బంది గర్వంగా చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా సేవలు అందించడమే మా బాధ్యతని వారు పేర్కొన్నారు. ఈ సాహసోపేతమైన పని చేసిన సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గిరిజన నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సేవలంటే ఇలాగే ఉండాలని స్థానికులు కొనిాడుతున్నారు