అధికారికంగా ప్రారంభమైన పంచాయత్ సిరీస్ సీజన్ 5..
త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల..
ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన పంచాయత్ సిరీస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ సిరీస్ ఐదో సీజన్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. షో ప్రారంభమై 6 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసిన పోస్టులో, షోలోని కొన్ని సన్నివేశాలు మరియు బ్యాక్‌స్టేజ్ ఫొటోలు షేర్ చేస్తూ “6 years of being in Phulera and never wanting to leave… New Season, Now Filming” అంటూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు.
2020లో ప్రారంభమైన ఈ సిరీస్, మొదటి సీజన్ నుంచే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రతి సీజన్‌తో మరింత ఆదరణ పొందుతూ, ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సీజన్ 4 ముగింపు ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేసింది.
గత సీజన్‌లో సచివ్ జీ తన CAT ఫలితాల తరువాత ఏం చేయాలనే ఆలోచనలో ఉండగా, మంజు దేవి పంచాయత్ ఎన్నికల్లో ఓటమితో బాధపడుతుంది. అలాగే ప్రథాన్ జీ కూడా ఆ ఫలితంతో కలవరపడిన పరిస్థితిలో కథ ముగిసింది. ఇప్పుడు సీజన్ 5 ఈ ఉత్కంఠభరిత పరిస్థితి నుంచే కథను ముందుకు తీసుకెళ్లనుంది.
ఈ కొత్త సీజన్‌లో ఫులేరా గ్రామానికి ప్రత్యేకమైన హాస్యం, భావోద్వేగాలు, డ్రామాతో పాటు కొత్త మలుపులు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సిరీస్‌ను ది వైరల్ ఫీవర్ నిర్మించగా, దీపక్ కుమార్ మిశ్రా మరియు చందన్ కుమార్ రూపొందించారు. రచన కూడా చందన్ కుమార్ అందించగా, దర్శకత్వం దీపక్ కుమార్ మిశ్రా వహిస్తున్నారు.
ఈ సీజన్‌లో ప్రముఖ నటులు జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, ఫైసల్ మాలిక్, చందన్ రాయ్, సన్వికా, దుర్గేష్ కుమార్, సునీత రాజ్వార్, పంకజ్ ఝా తిరిగి కనిపించనున్నారు.
ప్రతి సీజన్‌తో ప్రేక్షకులతో బలమైన అనుబంధాన్ని పెంచుకుంటూ వచ్చిన ‘పంచాయత్’, ఫులేరా అనే గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు సీజన్ 5తో ఈ కథ మరింత లోతుగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్ కొత్త సీజన్ త్వరలోనే అమేజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది.