Employement- హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కీలక నిర్ణయం: ఎంపిక చేసిన సిబ్బందికి ఇంటి నుంచే పని!
ప్రధాని మోదీ పిలుపునకు స్పందన: ఇంధన పొదుపు బాటలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్!
బ్యాంకింగ్ రంగంలో సరికొత్త ప్రయోగం: నెల రోజుల పాటు పైలట్ ప్రాజెక్ట్‌గా డబ్ల్యూఎఫ్‌హెచ్!
Bank Employees: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి తమ సిబ్బంది కోసం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన పొదుపును ప్రోత్సహించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కార్పొరేట్ సంస్థలకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. ప్రధాని ఇచ్చిన ఈ పొదుపు మంత్రాన్ని అందిపుచ్చుకున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాజమాన్యం, తమ కార్యాలయాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఉద్యోగులకు ఊరటనిచ్చేలా సరికొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తక్షణమే అమల్లోకి తెచ్చింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంక్‌లో పని చేసే ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు వారంలో రెండు రోజుల పాటు ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ విధానాన్ని బ్యాంక్ యాజమాన్యం హైబ్రీడ్ మోడల్‌లో ప్రవేశపెట్టింది. దీనిని ప్రస్తుతానికి నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ ఒక నెల కాలంలో ఉద్యోగుల పనితీరు, సేవల నాణ్యతను నిశితంగా పరిశీలించిన తర్వాతే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మున్ముందు కూడా పూర్తి స్థాయిలో కొనసాగించాలా లేదా అనే దానిపై యాజమాన్యం ఒక స్పష్టమైన నిర్ణయానికి రానుంది.
అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం బ్యాంక్‌లో పని చేసే ఉద్యోగులందరికీ వర్తించదని యాజమాన్యం స్పష్టం చేసింది. రోజువారీ విధుల్లో భాగంగా వినియోగదారులతో నేరుగా ముఖాముఖి సంబంధాలు లేని అంతర్గత విభాగాల సిబ్బందికి మాత్రమే ఈ అవకాశం కల్పించారు. ముఖ్యంగా బిజినెస్ అండ్ కార్పొరేట్ బ్యాంకింగ్, ట్రెజరీ ఆపరేషన్స్, డిజిటల్ బ్యాంకింగ్ రంగాలు, మానవ వనరుల విభాగం, అలాగే ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు మాత్రమే వారానికి రెండు రోజులు ఇంటి నుండి విధులు నిర్వహించడానికి అర్హులుగా నిర్ణయించారు.
ఇదే సమయంలో బ్యాంకు శాఖలకు వచ్చే సాధారణ ఖాతాదారులతో నేరుగా లావాదేవీలు జరిపే సిబ్బంది మాత్రం ఎప్పటిలాగే కార్యాలయాలకు వచ్చి తమ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ హైబ్రీడ్ విధానం వల్ల బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగవని, రోజువారీ బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండబోదని సంస్థ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు భరోసా ఇచ్చారు. అంతర్గత పనులను డిజిటల్ పద్ధతుల్లో ఇంటి నుంచే పూర్తి చేయడం ద్వారా కార్యాలయాల్లో విద్యుత్, ఇతర వనరుల పొదుపు కూడా సాధ్యమవుతుందని బ్యాంక్ భావిస్తోంది.
కార్పొరేట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీసే ఈ సరికొత్త ప్రయోగాన్ని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డిఎఫ్‌సి తీసుకున్న ఈ నిర్ణయం గనుక ఆశించిన ఫలితాలను ఇస్తే, రాబోయే రోజుల్లో ఇతర ప్రముఖ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపునకు మద్దతు ఇస్తూనే, మరోవైపు ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించేలా ఉన్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.