పూణేలో నీట్ లీక్ మాస్టర్‌మైండ్ అరెస్ట్..
దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. కీలక ఆధారాల స్వాధీనం..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న పూణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరఫున పరీక్షల నిర్వహణ ప్రక్రియలో భాగమైన ఆయనకు ప్రశ్నాపత్రాలకు ఆకెస్స్ ఉండేదని సీబీఐ వెల్లడించింది.
గత 24 గంటల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కులకర్ణిని పూణేలో అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన ఇద్దరు నిందితులను పూణే కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ తీసుకునేందుకు సీబీఐ చర్యలు చేపట్టింది. అనంతరం వారిని ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచారం. అంతకుముందు అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ముగ్గురు జైపూర్‌కు చెందినవారు కాగా, ఒకరు గురుగ్రామ్, మరొకరు నాసిక్‌కు చెందినవారని అధికారులు తెలిపారు.
ఈ ఐదుగురిని ఢిల్లీలోని సంబంధిత కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం వారిని సీబీఐ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి పలువురు అనుమానితులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
నీట్-యూజీ 2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించిన ఆరోపణలపై విద్యాశాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 12న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపడుతున్నామని సీబీఐ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ ఘటనపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షల విశ్వసనీయతపై మచ్చపడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.