మొన్నటివరకు పండుగల సీజన్‌తో పాటు మేడారం జాతర ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. డిసెంబర్లో క్రిస్మస్, జనవరిలో కొత్త సంవత్సరం, ఆ వెంటనే సంక్రాంతి పండుగలు, మేడారం మహాజాతర ఒకేసారి రావడంతో చికెన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా స్కిన్లెస్ చికెన్ ధర కిలో రూ.350 నుంచి రూ.380 వరకు పెరిగింది. డ్రెస్డ్ చికెన్ కిలో రూ.350 వరకు, లైవ్ కోడి రూ.200 వరకు విక్రయించడంతో నాన్‌వెజ్ ప్రియులు జేబు ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పండుగల సీజన్ ముగియడంతో పాటు మేడారం జాతర కూడా పూర్తవడంతో చికెన్ డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో ధరలు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.240 నుంచి రూ.250 వరకు లభిస్తుండగా, డ్రెస్డ్ చికెన్ రూ.220 నుంచి రూ.230 మధ్య ఉంది. లైవ్ కోడి ధర కేవలం రూ.118 నుంచి రూ.120కే పరిమితమైంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు దాదాపు రూ.100 వరకు పడిపోవడంతో నాన్‌వెజ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పండుగల తర్వాత కోళ్లకు డిమాండ్ తగ్గడమే కాకుండా, కోళ్ల ఉత్పత్తి కూడా భారీగా పెరగడం వల్లే ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫార్మ్‌లలో ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, మార్కెట్లో కొనుగోలుదారులు తక్కువగా ఉండటంతో తక్కువ ధరలకే చికెన్ విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఆదివారాల్లో సాధారణంగా చికెన్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు సండే కావడంతో చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ధరలు తగ్గడంతో కుటుంబాలంతా నాన్‌వెజ్ వంటకాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా తగ్గాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.10 వరకు చేరగా, ప్రస్తుతం రిటైల్ షాపుల్లో కేవలం రూ.6కే లభిస్తోంది. దీంతో సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గిందని చెప్పవచ్చు. అటు మటన్ ధరలు కూడా పండుగల సమయంలో కిలో రూ.1500 వరకు పలకగా, ఇప్పుడు రూ.800కే లభిస్తోంది. ధరలు తగ్గడంతో చికెన్, మటన్ దుకాణాల ముందు జనాలు క్యూ కడుతున్నారు. మొత్తం మీద పండుగల తర్వాత మాంసాహార ధరలు కుప్పకూలడంతో నాన్‌వెజ్ ప్రియులకు ఇది నిజంగా తీపి వార్తగా మారింది.