టీటీఏ మెగా కన్వెన్షన్ 2026..
ఎడిసన్ నగరంలోని అక్బర్ రెస్టారెంట్ వేదికగా..
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 సన్నాహక కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన “కన్వెన్షన్ కిక్ ఆఫ్ – మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఎంతో వైభవంగా, కన్నుల పండుగగా సాగింది.
ఎడిసన్ నగరంలోని అక్బర్ రెస్టారెంట్ వేదికగా ఏప్రిల్ 11 (శనివారం) సాయంత్రం జరిగిన ఈ వేడుకకు టీటీఏ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కన్వెన్షన్ లోగోను ఆవిష్కరించి, రాబోయే మహాసభల ప్రాముఖ్యతను వివరించారు. విదేశాల్లో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో ఇటువంటి కార్యక్రమాల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు.
ఇక టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 జూలై 17 నుంచి 19 వరకు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మహాసభలు తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే వేడుకగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కిక్ ఆఫ్ ఈవెంట్‌లో వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ గాయకులు అద్వైత్, చైతు మద్దూరి తమ మధుర గానంతో ప్రేక్షకులను అలరించి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చారు.
ఈ కార్యక్రమంలో టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అలాగే న్యూజెర్సీ టీమ్ ప్రతినిధులు శివ రెడ్డి కొల్ల (జనరల్ సెక్రటరీ), నరసింహ పెరుక, సుధాకర్ ఉప్పల, అరుణ్ అర్కల ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
మొత్తంగా ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ టీటీఏ మెగా కన్వెన్షన్‌కు అద్భుతమైన ఆరంభంగా నిలిచింది. రాబోయే మహాసభలపై తెలుగు వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచింది. మరిన్ని వివరాల కోసం www.ttaconvention.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు కోరుతున్నారు.