వావ్ మామ్స్ అండ్ వండర్ కిడ్స్ వేడుకలు..
తల్లుల త్యాగాలు, సేవలను గుర్తుచేసుకుంటూ..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) పిట్స్బర్గ్ విభాగం మరో ప్రత్యేక కార్యక్రమంతో ముందుకొస్తోంది. మాతృత్వానికి గౌరవం తెలుపుతూ, చిన్నారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ‘వావ్ మామ్స్ అండ్ వండర్ కిడ్స్’ అనే వినూత్న వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తెలుగు కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకలను ఏప్రిల్ 26, 2026 మరియు మే 09, 2026 తేదీల్లో నిర్వహించనున్నారు. తల్లుల త్యాగాలు, సేవలను గుర్తుచేసుకుంటూ వారికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వివిధ రకాల పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లులు–పిల్లల మధ్య బంధాన్ని మరింత బలపరచాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆకర్షణలతో ప్రణాళిక రూపొందించారు.
ఈ వేడుకల కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి మార్గదర్శకత్వంలో పిట్స్బర్గ్ సమన్వయకర్తలు రవి కొండపి, శిల్పా బోయినతో పాటు స్థానిక టీమ్ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తున్నారు. బోర్డ్ అండ్ ఈసీ (BOD & EC) ప్రతినిధులు అనుదీప్ అర్ల, రవి తుమ్మల ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు.
పిట్స్బర్గ్ మరియు పరిసర ప్రాంతాల్లోని తెలుగు కుటుంబాలందరూ ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాట్స్ ప్రతినిధులు కోరారు. మరిన్ని వివరాల కోసం +1-888-483-5848 నంబర్ కు సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే సంస్థ అధికారిక వెబ్సైట్ www.natsworld.org ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.
మాతృత్వాన్ని సెలబ్రేట్ చేస్తూ, చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించే ఈ కార్యక్రమం పిట్స్బర్గ్ తెలుగు సమాజంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.