డబ్లిన్ నగరంలో “హోలీ కార్నివాల్” పేరుతో రంగుల పండుగ..
డీజే సంగీతం, ఉత్సాహభరితమైన డ్యాన్స్ ప్రదర్శనలు..
కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ (CTA) ఆధ్వర్యంలో ఈ ఏడాది హోలీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికాలోని ఓహియో రాష్ట్రం, డబ్లిన్ నగరంలో “హోలీ కార్నివాల్” పేరుతో ఈ రంగుల పండుగను జరుపుకోనున్నారు. తెలుగు కుటుంబాలు, స్నేహితులు కలిసి ఆనందంగా గడిపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ వేడుకలు ఏప్రిల్ 19 (ఆదివారం) మధ్యాహ్నం 1:30 గంటల నుండి డబ్లిన్ కాఫ్మన్ పెవిలియన్ వేదికగా ప్రారంభం కానున్నాయి. రంగుల హరివిల్లుల మధ్య సందడి వాతావరణంలో ఈ కార్యక్రమం సాగనుంది.
కార్యక్రమంలో వినోదానికి పెద్దపీట వేశారు. డీజే సంగీతం, ఉత్సాహభరితమైన డ్యాన్స్ ప్రదర్శనలు, కార్నివాల్ తరహాలో వివిధ వినోద కార్యక్రమాలు పాల్గొనేవారిని అలరించనున్నాయి. చిన్నా పెద్దా అందరూ ఆనందంగా పాల్గొనేలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.
ఈ వేడుకలకు ఎంట్రీ పూర్తిగా ఉచితం కావడం ప్రత్యేక ఆకర్షణ. అలాగే అసోసియేషన్ మెంబర్లకు 2 ఉచిత కలర్ ప్యాకెట్లు, 2 ఉచిత కార్నివాల్ బ్యాండ్లు అందజేయనున్నారు. పాల్గొనేవారికి రుచికరమైన వంటకాలు అందించేందుకు వివిధ ఫుడ్ వెండర్స్ కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను సీటీఏ ప్రతినిధులు రంజిత్ గంపా, విష్ణు తూముల, పవిత్ర కోట, పున్నం వెల్పుల, సృజన్ రెడ్డి, సురేష్ ముఖిరాల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు. తెలుగు కుటుంబాలన్నీ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రంగుల పండుగను విజయవంతం చేయాలని వారు కోరారు. మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం www.zeffy.com/en-US/ticketing/holi-2 వెబ్సైట్ను సందర్శించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.