జపాన్ మరోసారి ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. ఆదివారం దేశ ఈశాన్య ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ తీవ్రత నమోదవ్వడంతో జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతేకాకుండా బుల్లెట్ రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రజలు భయభ్రాంతులకు గురై తమ ఇళ్లను విడిచి బయటకు పరుగులు తీశారు.
వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, సంరికు తీరానికి సమీపంలోని సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:03 గంటలకు భూమి బలంగా కంపించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలతో ఇవాతె రాష్ట్ర తీరాన్ని మీటరు ఎత్తు వరకు సునామీ అలలు తాకే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. ఒఫునాటోలో 10 సెంటీమీటర్ల ఎత్తున, మియాకోలో మధ్యస్థాయి అలలు తీరాన్ని తాకినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
ప్రకంపనల ప్రభావంతో తొహోకు షింకన్సెన్ బుల్లెట్ రైలు సేవలను జేఆర్ ఈస్ట్ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే రైలు రవాణాను తిరిగి ప్రారంభించారు. మరోవైపు జపాన్ ప్రధాని సనాయె తకైచి ప్రజలను అప్రమత్తం చేశారు. ‘సునామీ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాబట్టి వెంటనే తీరం నుంచి దూరంగా వెళ్లి సురక్షిత ప్రాంతాల్లో ఉండండి. ఊహించిన దానికంటే పెద్ద సునామీ రావచ్చు’ అని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇక మియాగి రాష్ట్రంలోని ఒనగావా అణు విద్యుత్ కేంద్రంలో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్లాంట్ సురక్షితంగా ఉందని తొహోకు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ స్పష్టం చేసింది. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశముందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. సునామీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సముద్రతీరాలకు వెళ్లరాదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.