రేషన్ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ దాదాపు పూర్తి కాగా, ఇంకా వేల సంఖ్యలో కార్డులు లబ్ధిదారుల చేతికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పిలుపులు, సూచనలతోనూ కొంతమంది లబ్ధిదారులు ఈ కార్డులను సేకరించకపోవడంతో, ఆయా రేషన్ డీలర్లు వాటిని తహసీల్దార్ కార్యాలయాలకు పంపించడం ప్రారంభించారు. ఇకపై తమ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోని వారు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో అక్రమాలు జరగకుండా, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ సరుకులు చేరేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రతి రేషన్ కార్డు సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని నిబంధనను అమలు చేస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా అనర్హులను గుర్తించడం, నకిలీ కార్డులను రద్దు చేయడం సులభమవుతుందని అధికారులు తెలిపారు. ఒకే వేలిముద్రతో ఈ–పోస్ యంత్రాల ద్వారా ఈ–కేవైసీ పూర్తి చేయవచ్చని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యమని చెప్పారు.
అయితే ఇప్పటికీ వేలాది మంది లబ్ధిదారులు తమ ఈ–కేవైసీ పూర్తి చేయకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే సూచనలు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రభుత్వం ఈ–కేవైసీ పూర్తి చేయని కార్డులపై చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. లబ్ధిదారులు ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నారా, వలస వెళ్లారా, మరణించారా, అనర్హులా అనే అంశాలపై జిల్లా స్థాయి సర్వేలు ప్రారంభమయ్యాయి. ఈ సర్వే ముగిసిన తర్వాత అనర్హుల గుర్తింపు, కార్డు రద్దు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పేదలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారడంతో పాటు, అక్రమాలకు తావు ఉండదని వారు పేర్కొన్నారు. రేషన్ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఆధునిక సాంకేతికతతో పేదలకు సురక్షితమైన పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం తమ ఈ–కేవైసీని త్వరగా పూర్తి చేసుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు.