బ్రెజిల్లో జరుగుతున్న COP30 సదస్సులో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 53 దేశాలు కలిసి ఉష్ణమండల అటవీ ప్రాంతాలను కాపాడుతున్న దేశాలకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు కొత్త గ్లోబల్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపాయి. ఈ నిర్ణయాన్ని ఆతిథ్య దేశం బ్రెజిల్ ప్రభుత్వం ప్రపంచ పర్యావరణ ఆర్థిక రంగంలో మలుపు తిప్పే ఘట్టం”గా పేర్కొంది.
ఈ ఫండ్ ద్వారా అటవీ సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్న దేశాలకు నిధులు అందించనున్నాయి. ముఖ్యంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, జీవ వైవిధ్యాన్ని రక్షించడం, మరియు గిరిజన సమాజాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది.
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా మాట్లాడుతూ, అమెజాన్ అటవులు కేవలం బ్రెజిల్కే కాదు, ప్రపంచ వాతావరణ సమతుల్యానికి జీవనాధారం. ఈ నిర్ణయం అభివృద్ధి చెందుతున్న దేశాలకు న్యాయం చేస్తుంది, అని అన్నారు. ఆయన ప్రపంచ నాయకులను పర్యావరణ పరిరక్షణలో మరింత బాధ్యత వహించాలంటూ పిలుపునిచ్చారు.
ఈ గ్లోబల్ ఫండ్లో భాగస్వాములైన 53 దేశాల్లో భారతదేశం, ఇండోనేషియా, కాంగో, పెరూ, కొలంబియా వంటి పెద్ద అటవీ సంపద కలిగిన దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు కలిపి ప్రపంచంలో సుమారు 60 శాతం ఉష్ణమండల అటవీ ప్రాంతాలను కలిగి ఉన్నాయి.
నూతనంగా ఆవిష్కృతమైన ఈ నిధి ద్వారా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు సమకూర్చే నిధులను పారదర్శకంగా పంపిణీ చేయడానికి ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ నిధులు అటవీ సంరక్షణ ప్రాజెక్టులు, పర్యావరణ పరిశోధనలు, స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధి వంటి కార్యక్రమాలకు వినియోగించబడతాయి.
పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం వాతావరణ మార్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటవీ ప్రాంతాలు నాశనం కాకుండా ఉంటే, భవిష్యత్తులో వర్షపాతం సమతుల్యం, పంటల ఉత్పాదకత, నీటి వనరుల స్థిరత్వం వంటి అంశాలు మెరుగుపడతాయని వారు భావిస్తున్నారు.
COP30లో తీసుకున్న ఈ నిర్ణయం, ప్రపంచ వాతావరణ చర్చల్లో కొత్త దిశను సూచిస్తోంది. పర్యావరణాన్ని కాపాడిన దేశాలకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా, సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాల వైపు ప్రపంచం వేగంగా పయనించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.