సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తీవ్ర షాక్‌కు గురయ్యారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిపై ఆమె సీరియస్ అయ్యారు. ఈ విషయం ఆమెకు తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. మొదట అనుపమ, ఈ ఫోటోలు ఎవరు సృష్టించారో తెలియక అయోమయంలో పడ్డారు. కానీ సైబర్ పోలీసులు చేపట్టిన విచారణలో అసలు విషయం బయటపడింది. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల యువతి ఈ మార్ఫింగ్ ఫొటోలను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేస్తోందని తెలిసింది. ఈ విషయం తెలిసి అనుపమకే నమ్మశక్యంగా లేకపోయిందట.
ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఆ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, మార్ఫ్ చేసిన ఫోటోలు, అసభ్యకరమైన కంటెంట్ పోస్టు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కొన్ని పేజీల్లో వీటి స్క్రీన్షాట్లు వేగంగా వైరల్ కావడంతో అనుపమకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. అభిమానులు కూడా నిజమా కాదా అని కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ స్వయంగా ముందుకొచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తనపై ఈ విధంగా అసత్య ప్రచారం చేయడం మహిళల గౌరవానికి విరుద్ధమని, న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ఆమె మీడియాతో చెప్పారు. ‘‘ఇలా ఎవరికైనా జరగవచ్చు. నేటి సోషల్ మీడియా యుగంలో మార్ఫింగ్ టెక్నాలజీ వల్ల చాలా మంది నిర్దోషులు బాధపడుతున్నారు. నేను మౌనం వహించి ఉంటే రేపు ఇంకెవరో బాధపడాల్సి వస్తుంది’’ అని అనుపమ స్పష్టం చేసింది.
ఆ యువతి ఎందుకు ఈ పని చేసిందో తెలుసుకోవడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆమె సైబర్ ఫేక్ ఐడెంటిటీలు సృష్టించి ఫాలోవర్లను పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమట. కానీ అది చట్టవిరుద్ధమని, ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ అధికారులు తెలిపారు.
అనుపమ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి ఘటన జరిగినా కూడా తన కెరీర్‌పై దాని ప్రభావం పడనివ్వనని ఆమె చెబుతున్నారు. ‘‘నిజం నా వైపు ఉంది. అభిమానుల మద్దతు నాకుంది’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటనతో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చర్చ మొదలైంది. పలువురు నటీమణులు, మహిళా సంఘాలు అనుపమకు మద్దతు తెలుపుతూ మార్ఫింగ్ లాంటి నేరాలపై కఠిన చట్టాలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు.