ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వృత్తిలో కొనసాగుతూ దురదృష్టవశాత్తు మరణించిన 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు గాను, ప్రభుత్వం రూ. 46 కోట్లను విడుదల చేసింది.
ఈ సహాయం కింద ప్రతి కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున సాయం అందనుంది. ఈ మేరకు అర్హులైన న్యాయవాదుల జాబితాను ఖరారు చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలను జారీ చేసింది.
ఈ నిధులను "ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్" కింద విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
మరణించిన న్యాయవాదికి సంబంధించిన నామినీకి ఈ ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నిధుల పంపిణీకి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభా దేవి ఉత్తర్వుల ద్వారా ఏపీ బార్ కౌన్సిల్ కార్యదర్శిని ఆదేశించారు.
వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తూ అకస్మాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం కొంత ఊరట కలిగిస్తుందని, ఇది ప్రభుత్వ మానవతా దృక్పథానికి నిదర్శనమని భావిస్తున్నారు.