ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా శేషాచలం కొండల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా ఆగడం లేదు. పుష్ప సినిమాలో చూపించినట్లుగానే స్మగ్లర్లు పోలీసులను, అధికారులను మేనేజ్ చేస్తూ తమ దందాను కొనసాగిస్తున్నారు. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో, డిప్యూటీ సీఎం మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు.
తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నేరుగా పర్యటించారు. అడవిలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణించి, రెండు కిలోమీటర్ల మేర కాలినడకన చెట్లను పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురు, మరియు శేషాచల ప్రాంతానికి ప్రత్యేకమైన అరుదైన మొక్కల వివరాలు అధికారుల నుండి తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుండి మొత్తం అడవి ప్రాంతాన్ని పరిశీలించారు.
వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖీ నది ఉద్భవ స్థానం వంటి వివరాలను పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాలను గమనించారు. అటవీ విభాగం అధికారులు చేపడుతున్న చర్యలు, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్లు, టాస్క్ ఫోర్స్ చర్యలు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.
తర్వాత పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా మంగళంలోని అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్లను పరిశీలించారు. మొత్తం ఎనిమిది గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్లను పరిశీలించి, ఎ, బి, సి మరియు నాన్ గ్రేడ్ల వారీగా ఉన్న దుంగల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్లో ఉన్న రికార్డులను పరిశీలించి, ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పట్టుబడిన దుంగ నుండి అమ్ముడయ్యే దుంగ వరకు పూర్తి రికార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఒక్క దుంగ కూడా మిస్ కాకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.