ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహనే లక్ష్యం..
MSME రూపురేఖలు మార్చనున్న ‘NSE ఎమర్జ్’..
ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13న విజయవాడలోని నోవోటెల్ విజయవాడ హోటల్‌లో ప్రత్యేక “SME IPO అవగాహన సదస్సు” నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి నారా లొకేష్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలకు పెట్టుబడి అవకాశాలపై అవగాహన కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచే ఎంఎస్ఎంఈల అభివృద్ధిలో “NSE ఎమర్జ్” కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇప్పటివరకు చిన్న పరిశ్రమలు ఎక్కువగా బ్యాంకు రుణాలపైనే ఆధారపడేవని, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
‘NSE ఎమర్జ్’ వేదిక ద్వారా చిన్న పరిశ్రమలు ఈక్విటీ మూలధనం సేకరించవచ్చని, దీంతో వడ్డీ భారం తగ్గడమే కాకుండా సంస్థల ఆర్థిక స్థితి మరింత బలపడుతుందని వివరించారు. ముఖ్యంగా డెట్-ఈక్విటీ నిష్పత్తి మెరుగుపడి, భవిష్యత్తులో క్రెడిట్ రేటింగ్ పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
చిన్న పరిశ్రమలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని మంత్రి చెప్పారు. “వేస్ట్ టు వెల్త్” వంటి వినూత్న సాంకేతికతలతో పనిచేసే స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఈ పార్కుల్లోని యూనిట్లకు ఇది పెద్ద అవకాశమని అభిప్రాయపడ్డారు.
ఈ విధానం ద్వారా కేవలం పెట్టుబడులే కాకుండా పారదర్శక యాజమాన్యం, మెరుగైన బ్రాండ్ విలువ కూడా సంస్థలకు లభిస్తుందని తెలిపారు. మెయిన్ బోర్డ్ కంపెనీల మాదిరిగా ప్రతి మూడు నెలలకు కాకుండా, ఆరు నెలలకు ఒకసారి ఆర్థిక నివేదికలు సమర్పించే వెసులుబాటు కూడా ఎంఎస్ఎంఈలకు ఉంటుందని చెప్పారు.
ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కీలక పాత్ర పోషించారని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థలు, చిన్న పరిశ్రమల యజమానులు ఈ సదస్సును వినియోగించుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.