సౌది లో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు..
కార్యక్రమానికి తరలి వచ్చిన కూటమి కార్యకర్తలు..
సౌది అరేబియా తూర్పు ప్రాంతంలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగి, అక్కడి తెలుగు సమాజం ఐక్యతను ప్రతిబింబించాయి.
ఈ కార్యక్రమానికి శ్రీ నాగశేఖర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను సమర్థంగా నడిపించారు. ప్రముఖ వ్యాపారవేత్త, H S Steel అధిపతి మరియు నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి అభిమాని అయిన శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయకత్వం ఎంత అవసరమో వివరించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాలను కూడా ప్రస్తావించారు.
శ్రీ నాగేశ్వరరావు బులుసు మాట్లాడుతూ, తాను మరియు జుబైల్ బృందం గత పదేళ్లుగా తెలుగుదేశం పార్టీపై అభిమానంతో అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
సభలో అనిత నాగశేఖర్, డా. కిరణ్ కుమార్ యాదవ్, రవి మల్లిన, కిషోర్ పారెపల్లి, కేవీఎన్ రాజు, దిలీప్ కుమార్ నేట్యం, రోహిత్ నందా, వంశీకృష్ణ, మారుతీ గౌడ్, శ్రీధర్ గౌడ, మనోహర్ ప్రసాద్, విజయ్ కుమార్ సుంకవల్లి, రాజేష్, చలసాని హరికృష్ణ తదితరులు ప్రసంగించారు. వారు తమ అనుభవాలను, చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని సభలో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో యువత పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుమారి నూహారి చౌదరి మాట్లాడుతూ, గూగుల్‌లో వెదికితే చంద్రబాబు ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులలో ఒకరని చెప్పింది. కుమారి గీతాంజలి మాట్లాడుతూ, రైతులకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత, ఐటీ రంగంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది.
సంపత్ కోయా తన విద్యార్థి దశలో చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలలో పాల్గొన్న అనుభవాలను పంచుకున్నారు. వరప్రసాద్ మాట్లాడుతూ, APNRTS సేవలను ప్రవాసాంధ్రులందరికీ చేరవేయాలని సూచించారు.
అలాగే P4 కార్యక్రమంపై మాట్లాడిన వక్తలు, అందరం కలిసికట్టుగా గ్రామాలు, మండలాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వరప్రసాద్ తన స్వంత మండలం బొమ్మనహాళ్‌లో చేపడుతున్న సేవలను వివరించారు.
అఖరిగా కోనేరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలోని ముందుచూపు, క్రమశిక్షణ, దార్శనికత, నిబద్ధత వంటి లక్షణాలను మన జీవితాల్లో కూడా అనుసరించాలని సూచించారు. హుదూద్ తుఫాను మరియు ఇటీవల కృష్ణా నది వరదల సమయంలో ఆయన చూపిన కార్యదక్షతను కొనియాడారు.మొత్తంగా ఈ వేడుకలు సౌది అరేబియాలోని తెలుగు ప్రజల ఐక్యతను, తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబిస్తూ విజయవంతంగా ముగిశాయి.