ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైలు ప్రయాణికులకు ఇది నిజంగా ఒక తీపికబురు అనే చెప్పాలి! రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఇకపై రెండు ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. ఈ శుభవార్తను రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గారు స్వయంగా వెల్లడించారు.
రైల్వే బోర్డు నుంచి అనుమతులు మంజూరు కావడంతో, కొవ్వూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు ఈ హాల్ట్లు పెద్ద ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.
కొవ్వూరులో ఆగనున్న రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఇవే…
ఇకపై కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఆగనున్న రెండు ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
మచిలీపట్నం – విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (నంబర్ 17219/17220)
విశాఖపట్నం – కడప తిరుమల ఎక్స్ప్రెస్ (నంబర్ 18521/18522)
కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు ఆపడానికి అనుమతి మంజూరు చేసినందుకు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వే బోర్డుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం కొవ్వూరు ప్రజల చిరకాల డిమాండ్లలో ఒకటి.
మచిలీపట్నం - విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రూట్ వివరాలు..
మచిలీపట్నం - విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (నంబర్ 17219/17220) రైలు ప్రయాణించే ముఖ్యమైన స్టేషన్లు ఇక్కడ చూడండి. ఈ రైలు ఇకపై కొవ్వూరులో ఆగుతుంది.
ఈ రైలు మచిలీపట్నంలో మొదలై... పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, తణుకు, నిడదవోలు, కొవ్వూరు (కొత్త హాల్ట్), గోదావరి, రాజమహేంద్రవరం, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్డు, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
విశాఖపట్నం – కడప తిరుమల ఎక్స్ప్రెస్ రూట్ వివరాలు..
దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించేవారికి విశాఖపట్నం - కడప తిరుమల ఎక్స్ప్రెస్ (నంబర్ 18521/18522) చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ రైలు ఇకపై కొవ్వూరుతో పాటు, ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలు విశాఖపట్నంలో మొదలై... దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్డు, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమహేంద్రవరం, కొవ్వూరు (కొత్త హాల్ట్), నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడు, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, కోడూరు, రాజంపేట, నందలూరు, కడప రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
కొత్త హాల్ట్లే కాకుండా, పండగల రద్దీ (Festival Rush) దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 17, 18: 07213/07214 విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు. 06095/06096 సంత్రాగచ్చి-చెన్నై సెంట్రల్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
నవంబర్ 4 నుంచి 26 వరకు: 07165/07166 భువనేశ్వర్-హైదరాబాద్కు మధ్య రాకపోకలు సాగిస్తాయి.
ఈ అదనపు రైళ్ల సౌకర్యాన్ని కూడా ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు. ఇకపై కొవ్వూరు ప్రయాణికులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.