ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య భద్రతను పర్యవేక్షించే 'వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్' (WHO) మరియు అగ్రరాజ్యం అమెరికా మధ్య దశాబ్దాలుగా ఉన్న బంధం ఇప్పుడు తెగిపోయే దిశగా కొనసాగుతుంది. కరోనా మహమ్మారి సమాచారాన్ని దాచిపెట్టారంటూ అమెరికా చేసిన ఆరోపణలను డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ తీవ్రంగా ఖండించారు. అమెరికా ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో రవ్వంతైనా వాస్తవం లేదని, ఆ దేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అని ఆయన హెచ్చరించారు.
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం జనవరి 22, 2026న ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అధికారికంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు వత్తాసు పలికిందని, కీలకమైన సమాచారాన్ని ప్రపంచానికి తెలియకుండా తొక్కిపెట్టిందని అమెరికా ఆరోపించింది. దీనివల్ల తమ దేశంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అమెరికా ఆరోగ్య మంత్రి కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధ్వజమెత్తారు.
ఈ ఆరోపణలపై స్పందించిన టెడ్రోస్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అమెరికా వాదనలను ఆధారాలతో సహా తిప్పికొట్టారు. మేము ఏ సమాచారాన్ని దాచలేదు. వైరస్ గుర్తింపు జరిగిన వెంటనే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాం. అమెరికా చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవి అని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా వంటి శక్తివంతమైన దేశం సంస్థ నుండి తప్పుకోవడం వల్ల కలిగే నష్టాలను టెడ్రోస్ వివరించారు.
నిధుల కొరత: డబ్ల్యూహెచ్‌ఓకు అందే నిధుల్లో అమెరికా వాటా చాలా పెద్దది. ఈ నిధుల కోత వల్ల పేద దేశాల్లో పోలియో, మలేరియా వంటి వ్యాధుల నిర్మూలన కార్యక్రమాలు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది వివరించారు.
భవిష్యత్ మహమ్మారులు: భవిష్యత్తులో వచ్చే కొత్త వైరస్‌లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవసరం. అమెరికా లేకపోవడం వల్ల అంతర్జాతీయ ఆరోగ్య భద్రత బలహీన పడుతుందని తెలిపారు.
ఆర్థిక బకాయిలు: సంస్థ నుండి వైదొలిగినా, అమెరికా దాదాపు రూ. 2,382 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తు చేశారు .
ప్రస్తుతానికి విభేదాలు తారాస్థాయికి చేరినప్పటికీ, అమెరికా త్వరలోనే తన తప్పును తెలుసుకుంటుందని టెడ్రోస్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజల ఆరోగ్యం కూడా ప్రపంచ ఆరోగ్యంతో ముడిపడి ఉంది. కాబట్టి వారు మళ్లీ సంస్థలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికాలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మద్దతుదారులు 'అమెరికా ఫస్ట్' విధానాన్ని స్వాగతిస్తుండగా, వైద్య నిపుణులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచం ఒకవైపు గ్లోబల్ వార్మింగ్, కొత్త వ్యాధులతో పోరాడుతున్న సమయంలో, ఇలాంటి విభజన రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.