- ఇవి ముమ్మాటికీ జగన్మోహన్ ప్రభుత్వ హత్యలే..
- ఈ 30 వేల మంది మరణాలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి..
Mangalagiri Varla Ramaiah: గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం కేవలం ఆంధ్రప్రదేశ్‌నే కాకుండా దేశం మొత్తాన్ని విస్మయానికి గురిచేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. అధికార బలంతో సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టి, మద్యం మాఫియాను ప్రోత్సహించిన తీరు అత్యంత దారుణమని విమర్శించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన అత్యుత్తమ మద్యం విధానాన్ని తుంగలో తొక్కి, కేవలం తన జేబులు నింపుకోవడానికే జగన్ రెడ్డి కొత్త మద్యం పాలసీని తెచ్చారు.
అదాన్ డిస్టిలరీస్‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని వింత బ్రాండ్లను ప్రవేశపెట్టి, ప్రజల ప్రాణాలతో జగన్ రెడ్డి ఆటలాడుకున్నారు. జే-బ్రాండ్లలో దైదల్, ఐసోపోలిక్ యాసిడ్ వంటి భయంకరమైన విష పదార్థాలు ఉన్నాయని లాబొరేటరీ రిపోర్టులు నెత్తీనోరు బాదుకున్నాగత ప్రభుత్వం వినలేదు. కేవలం కమిషన్ల కోసం ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని, ఆ విషాన్ని తాగించి దాదాపు 30,000 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. ఈ కల్తీ మద్యం వల్ల 35 లక్షల మంది కిడ్నీలు, లివర్లు దెబ్బతిని కళ్లు కనపడకుండా పోయాయి. వేలాది మంది యువత అచేతనంగా మారి దివ్యాంగులయ్యారు. నిషా ఎక్కించడమే లక్ష్యంగా విషాన్ని అమ్మిన నాటి ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం కాదా? ఈ 30 వేల మంది మరణాలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచారణకు ఆదేశించారు. దీంతో సెప్టెంబర్ 23, 2024న సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5, 2025న ఐజీ స్థాయి అధికారి రాజశేఖర్ బాబు నేతృత్వంలో వేసిన 'సిట్' విచారణలో ఒక్కొక్క అవినీతి తిమింగలం బయటకు వస్తోంది. ఏ ప్రలోభాలకు లొంగకుండా సిట్ అధికారులు చట్టబద్ధంగా దర్యాప్తు చేస్తుంటే జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారు పేరుతో మద్యం కుంభకోణానికి స్కెచ్ వేసిన ప్రధాన సూత్రధారి ఇతనే. ఎన్నికల ఖర్చుల కోసం కోట్లాది రూపాయలు వెనకేయాలని జగన్ రెడ్డి చెప్పినట్లు స్వయంగా ఇతనే ఒప్పుకోవడం గమనార్హం. వాసుదేవరెడ్డి (IRS) మద్యం శాఖతో అసలు సంబంధమే లేని ఈ వ్యక్తిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి బేవరేజెస్ ఎండీగా, డిస్టిలరీస్ కమిషనర్‌గా కూర్చోబెట్టారు. అవినీతి సొమ్మును ఎలా మాయం చేయాలో ఈయనకు ఉన్న "టాలెంట్" చూసే జగన్ రెడ్డి ఈయన్ని తెచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలక వ్యక్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏదీ జరగదు. ఆయన్ని, అలాగే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేస్తే జగన్ రెడ్డి నోరు మెదపలేదు. మీ కారులోనే తిరిగే ఓఎస్డీ అరెస్ట్ అయితే కనీసం స్పందించరా? మీ బినామీలు పట్టుబడితే మీకు సంబంధం లేనట్లు నటించడం మీ నైజం. రూ. 3500 కోట్లు గప్పిట్లో దాస్తే దాగిపోయేవి కావు. మీ అవినీతి దాహానికి 30 వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 35 లక్షల మంది ఆరోగ్యం పాడై అచేతనంగా మారిపోయారు. ఇంత జరుగుతున్నా "నాకు తెలియకుండా ఏం జరగలేదు" అని ఒక్క మాట కూడా అనలేని జగన్ రెడ్డి.. ఈ పాపంలో మీకు వాటా ఉన్నట్లే కదా? మీ నాయకులు, మీ ఆఫీసు వ్యక్తులు అరెస్ట్ అవుతుంటే ఎందుకు గగ్గోలు పెట్టడం లేదు? అవినీతి జరగలేదని చెప్పే దమ్ము మీకుందా? దేశం మొత్తం ఈ కుంభకోణం చూసి ఉలిక్కిపడుతుంటే, జగన్ రెడ్డి మాత్రం మహానటుడిలా నటించడం సిగ్గుచేటు. ప్రజలారా ఆలోచించండి.. అన్ని వేళ్లూ జగన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. చట్టం తన పని తాను చేస్తోంది, దోషులు ఎవరైనా సరే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేన్నన్నారు.
జగన్ రెడ్డి గారూ.. గత ఐదేళ్లు మీరు రాష్ట్రాన్ని పాలించారా లేక ఒక ఫ్యాక్షన్ ముఠాను నడిపారా? ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్‌ను ఐఏఎస్ ఇప్పిస్తామని లోబరుచుకున్నారు. మీ ఎంపీ మిధున్ రెడ్డి, మీ అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే నోరు ఎందుకు విప్పడం లేదు? మీ కంట్లో దూలం (రూ.3500 కోట్ల అవినీతి) పెట్టుకుని, ఎదుటివారి కంట్లో నలుసు వెతుకుతారా? నిన్న హైదరాబాద్‌లో గద్దర్ అవార్డులు ఇచ్చారు.. నిజానికి ఉత్తమ నటుడు అవార్డు మీకే ఇవ్వాలి. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో కంటే మీరు బాగా నటిస్తున్నారు. మీ వాళ్లు అవినీతి చేస్తూ అడ్డంగా దొరికిపోతుంటే, ఏమీ తెలియనట్టు మీరు వేసే వేషాలు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. అమాయకుడు అని మీరు సర్టిఫికేట్ ఇచ్చిన రాజ్ కసిరెడ్డి.. అమాయకుడైతే వేరే పేరుతో దొంగ పాస్‌పోర్టు ఎందుకు తీసుకుంటాడు? దుబాయ్ కి ఎందుకు పారిపోతాడని విమర్శించారు. ఇప్పటికే రూ. 441 కోట్లు ఈడీ సీజ్ చేస్తే, అది చిన్న అమౌంట్ అని మీరు తీసిపారేస్తారా? అవినీతి సొమ్ము పంపకాల్లో రాజ్ కసిరెడ్డి, శరత్ చంద్ర తన్నుకున్న మాట వాస్తవం కాదా? ఆ డబ్బు అంతా చివరికి మీ దగ్గరికే కదా చేరింది. ఈ అవినీతి డబ్బును బంగారంగా మార్చారు, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ సొమ్మంతా ఎక్కడుందో మీరే చెప్పాలి. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిట్ (SIT) ముందు లొంగిపోయిన అవినాష్ రెడ్డి అసలు రంగు ఇప్పుడు బయటపడింది. 2019-24 మధ్య ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి మద్యం సీసా అమ్మకంలోనూ, ప్రతి పైసా దోపిడీలోనూ ఇతని హస్తం ఉంది.
ఈయన కేవలం నిందితుడు మాత్రమే కాదు, మద్యం సిండికేట్‌ను నడిపించిన 'ఎగ్జిక్యూషన్ స్ట్రాటజిస్ట్' అని సిట్ తేల్చిచెప్పింది. సిట్ విచారణలో అవినాష్ రెడ్డి గొంతు విప్పాడు. "ఇది 2019-24 వరకు పనిచేసిన గుండె.. అన్నీ జగన్ రెడ్డి చెప్పినట్లే జరిగాయి" అని పరోక్షంగా ఒప్పుకుంటుంటే, జగన్ మోహన్ రెడ్డి గారూ.. మీరు ఎందుకు నోరు మెదపడం లేదు? మీ నీడలా తిరిగే మనుషులు, మీ బంధువర్గం అడ్డంగా దొరికిపోతుంటే.. 'నాకు సంబంధం లేదు' అని చెప్పే ధైర్యం మీకు ఉందా? విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ చాలా వేగంగా దర్యాప్తు చేస్తోంది. అవసరమైతే దుబాయ్ వెళ్లి కూడా విచారణ చేయాలని మేము కోరుతున్నాం. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా క్లియర్ గా చెప్పింది.. విచారణ జరగాల్సిందే, బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ మీ వైపే వేలు చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు రూ. 43 వేల కోట్ల అవినీతిపై సీబీఐ కేసుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.. ఇప్పుడు రూ. 3500 కోట్ల మద్యం కుంభకోణం బయటపడితే మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. కానీ ఇక మీ డ్రామాలు సాగవు. ఈ కుంభకోణానికి అంతిమ లబ్ధిదారు ఎవరో తేలే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.