2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద, పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్..
పోర్టులో కంటైనర్ల తరలింపుకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం..
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పోర్టు సంస్థ PSA ఇంటర్నేషనల్ (పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ)ను సందర్శించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే పోర్టు నిర్వాహకుల్లో PSA ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా PSA ఆధ్వర్యంలో నడుస్తున్న (Tuas Port) టువాస్ పోర్టును మంత్రులు నేరుగా పరిశీలించారు. 2040 నాటికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్‌గా రూపుదిద్దుకోనున్నట్లు అధికారులు వివరించారు.
పోర్టులో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతికతలు మంత్రులను ఆకట్టుకున్నాయి. కంటైనర్ల రవాణాకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, రిమోట్ కంట్రోల్ ద్వారా క్రేన్లను నిర్వహించడం వంటి విధానాలు అక్కడ అమలులో ఉన్నాయి. అలాగే షిప్పింగ్, లాజిస్టిక్స్, ప్రభుత్వ విభాగాల మధ్య సమాచారం వేగంగా డిజిటల్ రూపంలో మార్పిడి అవుతుండడం విశేషంగా నిలిచింది.
అదే విధంగా, రద్దీని తగ్గించేందుకు మరియు కంటైనర్ల కదలికలను ముందుగానే అంచనా వేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ సిస్టమ్‌లు ఉపయోగిస్తున్నట్లు PSA ప్రతినిధులు వివరించారు. సోలార్ ఎనర్జీ వినియోగంతో ఈ పోర్టును ‘గ్రీన్ పోర్ట్’గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ పర్యటనలో మంత్రులు పీ నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్శన ద్వారా అత్యాధునిక పోర్టు నిర్వహణ విధానాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పోర్టుల అభివృద్ధికి ఉపయోగపడే అనుభవాన్ని మంత్రులు సేకరించినట్లు సమాచారం.