రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పనితీరును విశ్లేషిస్తూ కీలక సూచనలు..
పెండింగ్ పనులపై సీఎం ఆదేశాలు.. భూగర్భజలాల పెంపుపై దృష్టి..
ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన, రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పనితీరును విశ్లేషిస్తూ కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, ఎత్తిపోతల పథకాలు, వరికపూడిశెల ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రాజెక్టుల పనులపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చాలా ప్రాజెక్టుల్లో ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించిన సీఎం, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఆలస్యం లేకుండా క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భూగర్భజలాల స్థాయి పెంపుపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘జల ధార’, ‘జల హారతి’ వంటి కార్యక్రమాల అమలుపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. నీటి వనరులను సమర్థంగా వినియోగించడం ద్వారా రైతులకు మరింత లాభం చేకూర్చాలని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని లక్షలాది ఎకరాలకు నీరు అందుతుందని, రైతుల జీవితాల్లో మార్పు వస్తుందని సీఎం పేర్కొన్నారు. అందుకే పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతపై రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు.
సాగునీటి ప్రాజెక్టుల పూర్తి ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగానికి బలం చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో ప్రాజెక్టుల పనులు వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.