వైకుంఠపురంబ్యారేజ్ తో కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ
పొన్నూరు లో జరిగిన రా.. కదలిరా... సభలో చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు "ఆళ్ళ"
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం వడ్లమూడి గ్రామంలో జరిగిన రా.. కదలిరా... సభలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు నేతృత్వంలో కృష్ణా పశ్చిమ డెల్టా కాకుమాను డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ నువ్వుల సునీల్ చౌదరి,చేబ్రోలు డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ మదన వెంకటరెడ్డి తదితరులు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మంజూరు చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఎంతో ఉపయోగ పడే వైకుంఠపురం బ్యారేజీ,గుంటూరు ఛానల్ ఆధునికీకరణ మరియు పొడిగింపు వరికపూడి సెల ఎత్తిపోతల పథకం, గోదావరి పెన్నా అనుసంధానం ఫేస్-1 లో భాగంగా హరిశ్చంద్రాపురం దగ్గర ఎత్తిపోతల పథకం తదితర ప్రాజెక్టులను భవిష్యత్తులో త్వరగా పూర్తి చేసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ... వైకుంఠపురం దగ్గర 10 టీ.ఎం.సీలతో కొత్తగా బ్యారేజ్ ను నిర్మించడానికి 2018 జూన్ నెలలో రూ.2,169 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందని,వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిని అటకెక్కించి తీవ్ర నిర్లక్ష్యం చేయడం జరిగిందని వైకుంఠపురం బ్యారేజ్ పూర్తయినట్లయితే కొత్తగా కృష్ణా నది మీద 10 టీఎంసీలు నీటి నిల్వ ఉండటమే కాకుండా కృష్ణా డెల్టా పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం,కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగడమే కాకుండా అమరావతి రాజధాని కి పుష్కలంగా తాగునీరు అందేదని తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అట్లాగే గుంటూరు జిల్లాలో కృష్ణా నది దగ్గర నుంచి గారపాడు వరకు ఉన్న గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.370 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, దీనిని గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం గారపాడు నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పొడిగించడానికి 2019లో రూ.247 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగిందని కానీ దీనిని వైసిపి ప్రభుత్వం కక్షపూరితంగా నిలుపుదల చేయడం జరిగిందని ఈ గుంటూరు ఛానల్ పొడిగింపు,ఆధునికీకరణ పూర్తి అయినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు,కాకుమాను, పెదనందిపాడు,వట్టిచెరుకూరు ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలాల్లో కొత్తగా 50వేల నూతన ఆయకట్టు స్థిరీకిరించబడుతుందని, మొత్తం 50 గ్రామాలకు సాగునీరు మరియు త్రాగునీరు పూర్తిగా అందుతుందని తెలియజేశారు.
అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి మండలం లో వరికపూడి సెల ఎత్తిపోతల పథకానికి 2019 ఫిబ్రవరి నెలలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.340 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం జరిగిందని,ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఏ విధమైన పనులు చేయకుండా ఈ మధ్యన ముఖ్యమంత్రి వెల్దుర్తి మండలం గంగాలకుంట దగ్గర పాత పథకానికి టెంకాయ కొట్టేందుకు రావటం సిగ్గుచేటని అన్నారు.
అదేవిధంగా గోదావరి పెన్నా నది అనుసంధానం మొదటి దశలో గుంటూరు జిల్లా హరిశ్చంద్రాపురం దగ్గర గత తెలుగు దేశ ప్రభుత్వ హయాములో 2018లో రూ.6,020 కోట్ల అంచనా తో ఫేస్-1 పనులకు శంకుస్థాపన చేయటం జరిగిందని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభం కాలేదు అనే ఒక కుంటి సాకుతో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసిందని,ఈ పథకం పూర్తయినట్లయితే వృధాగా సముద్రంలోకి వెళ్లే జలాలల్లో నుంచి 130 టీ.ఎం.సీల నీటిని ఆయకట్టు చివరి ప్రాంతాలకు తరలించి సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండేదని తెలియజేశారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు గత టీ.డీ.పీ ప్రభుత్వం లో మంజూరు చేసినటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ భవిష్యత్తులో ఏర్పాటు ఆయ్యే తెలుగుదేశం-జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో త్వరగా పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లినట్టు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు గుంటూరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి