మాంసాహార ప్రియులు వారమంతా నాన్-వెజ్ వండినా లొట్టలు వేసుకుంటూ తింటారు. అయితే ప్రతిరోజూ చికెన్, చేపలు లేదా పచ్చి రొయ్యలు తెచ్చుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వంకాయ కూరలో కాస్త ఎండు రొయ్యలు వేసి వండితే.. ఆ వాసనకే ఆకలి రెట్టింపవుతుంది. వంకాయ, ఎండు రొయ్యల కాంబినేషన్ అంటేనే 'వేరే లెవెల్'. పర్ఫెక్ట్‌గా అన్ని దినుసులు వేసి వండితే, ఆ అమోఘమైన రుచి ముందు చికెన్, మటన్ బిర్యానీలు కూడా సరిపోవండోయ్! మరింకెందుకు ఆలస్యం? బ్యాచిలర్ బాయ్స్, మ్యారీడ్ గర్ల్స్.. గెట్ రెడీ! ఈ వంకాయ-ఎండు రొయ్యల కూరను కుమ్మేద్దాం రండి.
కావలసిన పదార్థాలు:
వంకాయలు: అర కిలో (తాజావి)
ఎండు రొయ్యలు: 100 గ్రాములు (మీకు ఇష్టమైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు)
ఉల్లిపాయలు: రెండు
పచ్చిమిర్చి: నాలుగు
టమాటాలు: రెండు (మధ్యస్థ పరిమాణం)
పసుపు: ఒక స్పూన్
ఉప్పు: తగినంత
కారం: రెండు స్పూన్లు
ముఖ్యమైన చిట్కా: ఎండు రొయ్యలు పచ్చి రొయ్యల్లా మెత్తగా, టేస్టీగా రావాలంటే.. ఒక చిన్న ట్రిక్ పాటించండి. రొయ్యలను శుభ్రం చేసి, కాస్త పసుపు వేసి ప్రెజర్ కుక్కర్‌లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇలా చేయడం వల్ల ఎండు రొయ్యల నీచు వాసన పోవడమే కాకుండా, అవి పచ్చి రొయ్యల్లా తయారవుతాయి. ఆ తర్వాత వాటిని నూనెలో వేయిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
ముందుగా స్టవ్ వెలిగించి, మీడియం మంటపై ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి. గిన్నె వేడెక్కాక నూనె వేసి, అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేయండి. వెంటనే పసుపు, కారం, ఉప్పు వేసి మీడియం మంటపై మగ్గనివ్వండి. కూర నుండి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి ఉంచండి.
వంకాయ ముక్కలు మగ్గినట్లు అనిపించినప్పుడు, ఒక గ్లాసు నీరు పోయండి. కూరను ఒకసారి బాగా కలిపి, ఉప్పు-కారం సరి చూసుకోండి. కూర పై నూనె పైకి తేలేంతవరకు ఉంచి దించేయండి. అంతే గుమగుమలాడే వంకాయ - ఎండు రొయ్యల కర్రీ రెడీ వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటుంటే.. ఎంతటి వారైనా మీ వంటకు ఫిదా అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం మీరు వండి మీ ఆత్మీయులకు వడ్డించండి..