తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భక్తులకు వేగవంతమైన దర్శనం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు. అన్నప్రసాదాల నాణ్యతను పెంచి, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతోందని వివరించారు. భక్తుల నుండి మంచి స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా టీటీడీ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, రవాణా విభాగంలో ఉన్న కాంట్రాక్ట్ డ్రైవర్ల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం హాస్టల్ సీట్లు పెంచడం, నాణ్యమైన బోధన, వసతి సదుపాయాలు కల్పించడం వల్ల ఉత్తీర్ణతా శాతం పెరిగిందని తెలిపారు.
తిరుమలలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు కూడా టీటీడీ చర్యలు చేపడుతోంది. శ్రీవాణి టికెట్లు పొందే భక్తులకు అత్యాధునిక కౌంటర్లు ఏర్పాటు చేయడం, కల్యాణకట్టను ఆధునికంగా అభివృద్ధి చేయడం, అన్నప్రసాదాల పంపిణీ విస్తరించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల భద్రత కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళిక రూపొందించారు.
శ్రీవారి వైభవాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తున్నామని ఛైర్మన్ తెలిపారు. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో ఆలయాలు నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఆమోద ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. దళిత, గిరిజన, మత్స్యకార వాడలలో ఆలయాల నిర్మాణానికి కూడా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.