సమోసా అంటే మనకు సాధారణంగా కారం కూర ఫిల్లింగ్‌తో చేసే పంజాబీ స్టైల్ స్నాక్ గుర్తుకు వస్తుంది. కానీ, దీనిని తీపి వంటకంగా కూడా తయారు చేయవచ్చు. మావా (ఖోవా) ఫిల్లింగ్‌తో చేసే ఈ ప్రత్యేక మావా సమోసా ఉత్తర భారతదేశంలో పండుగలు, శుభకార్యాల సమయంలో ఎక్కువగా చేస్తారు. రుచికరమైన డ్రైఫ్రూట్స్, యాలకుల వాసనతో ఈ సమోసా తినేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది.
ముందుగా ఫిల్లింగ్ సిద్ధం చేసుకోవాలి. నెయ్యిలో బాదం, జీడిపప్పు, పొడి కొబ్బరిని స్వల్పంగా వేయించాలి. తర్వాత పాన్‌లో మావా వేసి కొద్దిసేపు వేయించి, అందులో పంచదార పొడి, యాలకుల పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్ మిశ్రమం కలపాలి. ఈ విధంగా తీపి, సువాసనతో కూడిన ఫిల్లింగ్ రెడీ అవుతుంది.
తర్వాత మైదా, పంచదార పొడి, సజ్జి రవ్వ, నెయ్యి కలిపి గోరువెచ్చని నీటితో మృదువుగా ముద్ద చేసి 30 నిమిషాలు మూతపెట్టాలి. ముద్దను చిన్న చపాతీ లాగా రుద్ది, అర్థచంద్రాకారంలో కట్ చేసి, మధ్యలో ఒక స్పూన్ మావా ఫిల్లింగ్ వేసి అంచులకు నీరు రాసి కోన్ ఆకారంలో మడిచి బిగించి మూయాలి.
ఇలా సిద్ధమైన సమోసాలను వేడి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. వేయించిన తర్వాత టిష్యూ పేపర్‌పై వేసి నూనె వడగట్టి వేడి వేడి గానే సర్వ్ చేయాలి. పండుగలు, కుటుంబ వేడుకల్లో ఈ మావా సమోసా వడ్డిస్తే ఒక ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది.