జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారుల కోసం ఎన్‌హెచ్ఏఐ (NHAI) ఒక సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, టోల్ ప్లాజా వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను గుర్తించి ఫిర్యాదు చేస్తే, రూ.1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ బహుమతిగా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ అభియాన్ను మద్దతుగా తీసుకుని, ఈ పథకం జాతీయ రహదారులపై వర్తిస్తుంది. అయితే ఈ అవకాశాన్ని పొందడానికి ప్రయాణికులు రాజ్‌మార్గయాత్ర యాప్లో కొత్త వెర్షన్‌ను ఉపయోగించి ఫిర్యాదు చేయాలి. పథకం ఈ సంవత్సరం అక్టోబర్ 31, 2025 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.
ఫిర్యాదు కోసం, ప్రయాణికులు అపరిశుభ్ర టాయిలెట్ ఫోటోలను జియో-ట్యాగ్ మరియు టైమ్-స్టాంప్తో అప్‌లోడ్ చేయాలి. ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత, వారు పేరు, ప్రాంతం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలను కూడా నమోదు చేయాలి. అప్పుడు ఫిర్యాదు ధృవీకరించబడినట్లయితే, వారి వెహికల్ నంబర్‌కు రూ.1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ బహుమతిగా అందుతుంది. ఈ రివార్డు ఒక్కసారి మాత్రమే పొందగలరు. అంటే, ఒక్క వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌కు ఒక్క రివార్డు మాత్రమే.
ఈ పథకం లో, ఒకే రోజు ఒక టాయిలెట్ మాత్రమే రివార్డు కోసం పరిగణించబడుతుంది. ఎక్కువ మంది ఒకే రోజు, ఒకే టాయిలెట్ గురించి ఫిర్యాదు చేస్తే, ముందుగా ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే రివార్డు లభిస్తుంది. అలాగే, ఎన్‌హెచ్ఏఐ గుర్తించిన, నిర్వహించే టాయిలెట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దాభాలు, పెట్రోల్ పంపులు, ఇతర ప్రైవేట్, ప్రభుత్వ ప్రదేశాల్లోని టాయిలెట్లకు రివార్డు వర్తించదు.
ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసినట్టు, ఫిర్యాదులు నకిలీ, పాతవి, ఎడిటింగ్ చేసిన ఫోటోలు కాకుండా, అసలు, జియో-ట్యాగ్ చేసిన ఫోటోలు మాత్రమే పరిగణించబడతాయి. అందిన ఫిర్యాదులను ఏఐ + మాన్యువల్ ధృవీకరణ ద్వారా పరిశీలించి రివార్డులు నిర్ణయించబడతాయి. ఈ విధానం ద్వారా మాత్రమే నిజమైన, బాధ్యతగల ప్రయాణికులకు మాత్రమే ఫాస్టాగ్ రీఛార్జ్ బహుమతి లభిస్తుంది.