Pawan Kalyan: వేట్లపాలెం ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.. క్షేత్రస్థాయిలో మంత్రి కందుల దుర్గేష్‌ పర్యటన..!!

Pawan Kalyan: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Published : 2026-02-28 20:22:00

వేట్లపాలెం బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్…

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ కల్యాణ్ ఆదేశం…

వేట్లపాలెం ప్రమాదానికి కారణాలపై ఆరా…

Pawan Kalyan: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై సమాచారం అందిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి, మంత్రులను ఘటనాస్థలికి పంపారు. ఆయన ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ శనివారం ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. అక్కడ పరిస్థితిని చూసి వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలు ఛిద్రమై పడి ఉండటం అత్యంత హృదయవిదారకమని ఆయన పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతమంతా శిథిలమయమైందని, అక్కడ పని చేసే కార్మికుల పరిస్థితి చూస్తుంటే మాటలు రావడం లేదని మంత్రి అన్నారు. మృతుల కుటుంబాలను ఆయన వ్యక్తిగతంగా పరామర్శించి, ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ పేలుడులో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రత్యేక నిపుణులతో వైద్యం చేయించాలని, మందుల కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని  అధికారులకు సూచించారు.

ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రెవెన్యూ, పోలీస్,  అగ్నిమాపక శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపై చర్చించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు.

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఘటన జిల్లావాసులను తీవ్ర విషాదంలో ముంచిందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వీలైనంత త్వరగా సహాయం అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఈ దురదృష్టకర ఘటనపై అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాద స్థలంలో ఇంకా ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

Spotlight

Read More →