నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి పూర్తిగా తేరుకోకముందే, ఆంధ్రప్రదేశ్‌కు మరో ముఖ్యమైన వాతావరణ సమాచారం అందింది. ఇక నుంచి ఈశాన్య రుతుపవనాల (North-East Monsoon) సీజన్ మొదలు కానుంది. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, ఈశాన్య రుతుపవనాలు రేపు (అక్టోబర్ 16న) దేశంలోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనే ఇవి ఆంధ్రప్రదేశ్‌ను తాకే అవకాశం ఉందని తెలిపారు.
ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చి, ముందుగానే వెనుదిరగడంతో, ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి మార్గం సుగమమైంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ రుతుపవనాల ప్రభావం ఉంటుంది.
ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షపాతంపై వాతావరణ నిపుణులు కొన్ని కీలకమైన అంచనాలను చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొనసాగుతున్న 'లానినొ' పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. లానినొ ప్రభావం వల్ల సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు మరింత బలపడి ఎక్కువ వర్షాలు కురుస్తాయి. దీనికి తోడు, అక్టోబర్ 22 లేదా 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది ఈశాన్య రుతుపవనాలను మరింత చురుగ్గా మార్చవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈశాన్య రుతుపవనాల సీజన్ అంటేనే తుపానుల సీజన్. అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడటానికి అనువైన వాతావరణం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అల్పపీడనం మరింత బలపడితే తుపానుగా మారే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగా రాబోయే రుతుపవనాలతో వర్షాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 515 మిల్లీమీటర్లకు గాను 530.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే, సాధారణ వర్షపాతమే నమోదైంది. అయితే, జూన్, జులై నెలల్లో వర్షాలు తక్కువగా పడి, ఆగస్టు, సెప్టెంబర్‌లలో కుండపోతగా కురవడంతో అనేక ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిలిచిపోవడం, తెగుళ్లు సోకడం వంటి కారణాలతో రైతులు భారీగా నష్టపోయారు.
ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు కూడా భారీ వర్షాలను మోసుకొస్తుండటంతో, చేతికి రాబోతున్న పంటలకు మళ్లీ ముప్పు తప్పదేమోనని అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.