Nara Lokesh: దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం.. ప్రభుత్వ పాఠశాల పిల్లలను.!

Nara Lokesh: "దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది నా ధ్యేయం. అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నాను. అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నాం.

Published : 2026-05-20 15:48:00
  • డీఈవోలు, ఏపీసీలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ సమావేశం..
     
  • Politics: ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలి..

Nara Lokesh: భారతదేశానికే అత్యున్నత ఆదర్శంగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని (Andhra Model Education) తీర్చిదిద్దడమే తన ఏకైక ధ్యేయమని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయస్థాయిలో మారుతున్న ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ గ్లోబల్ బోధనా పద్ధతులపై క్షేత్రస్థాయి అధ్యయనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా విదేశాలకు పంపుతున్నామని ఆయన వెల్లడించారు. విదేశీ పర్యటనల్లో భాగంగా అక్కడ వారు నిశితంగా గమనించిన అంతర్జాతీయ స్థాయి బోధనా నైపుణ్యాలను, వినూత్న విద్యా పద్ధతులను తిరిగి వచ్చి మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రకటించారు. అమరావతి సచివాలయం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఈవోలు (జిల్లా విద్యాశాఖాధికారులు) మరియు ఏపీసీలతో (అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్) మంత్రి లోకేశ్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల నాణ్యతను తక్షణమే మెరుగుపర్చకపోతే చివరకు తీవ్రంగా నష్టపోయేది పేద విద్యార్థులేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ అనేది ఇకపై ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఓపెన్ మార్కెట్‌తో పోటీపడే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం ఉన్నతాధికారుల నుండి ఉపాధ్యాయుల వరకు అందరం ఒకే తాటిపై కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ లోపాలను, సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశానని, వరల్డ్ క్లాస్ బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను సాధించడమే లక్ష్యంగా అధికారులంతా పూర్తి చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.

సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశం కేవలం సాధారణ సమీక్ష కోసం మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో విద్యాశాఖను పరుగులు పెట్టించే ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక (Action Plan) రూపకల్పన కోసమేనని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు మొత్తం ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారనే కనీస రాష్ట్రస్థాయి విజిబిలిటీ గానీ, ప్రాథమిక డేటాబేస్ గానీ అందుబాటులో లేకపోవడం తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన గుర్తుచేశారు. గతంలో తాను పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన అనుభవంతో, కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పూర్తిస్థాయి డేటాతో కూడిన ఆధునిక డ్యాష్ బోర్డును విజయవంతంగా తయారుచేశామని, కానీ విద్యాశాఖలో మాత్రం కనీస డేటా బేస్ కూడా లేని దుస్థితి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద పిల్లలను మన సొంత బిడ్డల్లా భావించి, ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. మనం తీసుకునే చిన్న విధానపరమైన నిర్ణయాలపైనే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, అందువల్ల ప్రతి ఒక్క అడుగు బిడ్డల భవిష్యత్ కేంద్రంగానే సాగాలని ఉద్ఘాటించారు. నూతనంగా రూపొందించిన డిజిటల్ డ్యాష్ బోర్డు గణాంకాల ప్రకారం నిర్దేశిత యాక్షన్ ప్లాన్ దిశగా క్షేత్రస్థాయిలో డీఈవోలు, ఏపీసీలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఒక లక్ష మంది పిల్లలు పాఠశాల చదువు మధ్యలోనే ఆపేసి డ్రాపవుట్స్ (Dropouts) గా మిగిలిపోవడంపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బడి ఈడు పిల్లలు ఉండి కూడా అసలు పాఠశాలల్లో పేర్లు నమోదు చేసుకోని (Never Enrolled) విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, రాబోయే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బడులలో నూరు శాతం విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ యంత్రాంగం కదలాలని పిలుపునిచ్చారు. తన సుదీర్ఘ ‘యువగళం’ పాదయాత్ర సమయంలో రాయలసీమలోని కర్నూలు జిల్లా అంతటా పర్యటించేటప్పుడు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నారి పిల్లలు బడి మానేసి వలస కార్మికులుగా మారుతున్న కఠిన వాస్తవాలను తాను కళ్లారా చూశానని ఈ సందర్భంగా భావోద్వేగంతో పంచుకున్నారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చిన్నారులు చదువు మానేసి పొలం పనులకు లేదా ఇతర కూలీ పనులకు వెళ్లే దుస్థితి ఉండకూడదని, ప్రతి ఒక్క బిడ్డ బడిలోనే ఉండేలా ఒక ప్రాపర్ డిజిటల్ ట్రాక్ మెకానిజం (Track Mechanism) ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఉద్యమంలా జీఎఫ్ఎల్ఎన్ చేపట్టాలి
"లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ను ఒక ఉద్యమంగా అమలుచేయాలి. వాస్తవాలు తెలుసుకున్నపుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. నిజం చేదుగా,  అబద్ధంగా తీయగా ఉంటుంది. వాస్తవాన్ని అంగీకరిస్తేనే మన ప్రయాణం సరైన దిశగా సాగుతుంది. మేం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు సరైన సమాచారం ఇవ్వాలి. ప్రస్తుతం 9వ తరగతికి క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేస్తున్నాం. క్రోమ్ బుక్స్ అందించబోతున్నాం. నూరుశాతం జీఎఫ్ఎల్ఎన్ సాధనే లక్ష్యంగా పనిచేయాలి. 5 శాతం వెనుకబడటం అంటే సాధారణమైంది కాదు. వాస్తవంలో అది లక్షల సంఖ్యలో ఉంటుంది. వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10శాతం ఎన్ రోల్ మెంట్ ఇంప్రూవ్ చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం సమిష్టిగా పనిచేయాలి" అన్నారు.

ఆత్మవిశ్వాసం నింపిన విద్యాశాఖ ప్రకటన
ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్, ప్రతిభావంతమైన టీచర్లు ఉన్నారని, పదోతరగతి ఫలితాలపై ఇటీవల తొలిసారి ప్రభుత్వమే యాడ్ ఇచ్చిందని తెలిపారు. అది పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపిందని అన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల ప్రణాళిక బాగా ఉపకరించిందని అన్నారు. అది అవసరం లేకుండానే ట్రాన్సిషన్ జరిగాలని, ఫౌండేషన్ పకడ్బందీగా ఉండాలని, దానిపై అధికారులంతా శ్రద్ధ వహించాలని సూచించారు.

రెండేళ్లలో రాష్ట్రమంతటా స్మార్ట్ కిచెన్లు
"రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ స్కూళ్ల మౌలిక  సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ ప్రవేశపెట్టాం. దీనిపై అధికారులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. క్రిటికల్ ఇన్ ఫ్రా కోసం ప్రభుత్వం నుంచి నిధులిస్తున్నాం. ఇందుకోసం అవసరమైతే దాతల సహకారం తీసుకోండి. ప్రతి పాఠశాలకు లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్, టాయ్ లెట్, బెంచిలు కచ్చితంగా ఉండాలి. బేసిక్ ఇన్ ఫ్రా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలన్నదే మా ధ్యేయం. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కడపలో స్మార్ట్ కిచెన్ అద్భుతంగా చేశారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం మొత్తం స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం" అని అన్నారు.

ఇంటర్నేషనల్ స్కూలుగా నిడమర్రు పాఠశాల
మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు స్కూలును ఇంటర్నేషనల్ స్కూలుగా తీర్చిదిద్దుతున్నామని లోకేశ్ తెలిపారు. అక్కడ తొలిసారి నో అడ్మిషన్ బోర్డు పెట్టారని అన్నారు. నెల్లూరులో కూడా రెండు స్కూల్స్ ను మంత్రి నారాయణ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక పాఠశాలను మోడల్ స్కూలుగా తీర్చిదిద్దాలని అధికారులను కోరుతున్నానని అన్నారు. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అనే కాన్సెప్ట్ అమలులో ఉందని అన్నారు. నిడమర్రులో మనం కల్పించిన అత్యుత్తమ సౌకర్యాల వల్ల పక్క నియోజకవర్గాల వారు కూడా ఈ నియోజకవర్గానికి తమ బిడ్డల అడ్మిషన్ కోసం నివాసం మార్చుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి కల్పించే లక్ష్యంతో పనిచేయాలని అన్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు.

బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలి
"నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక సంస్కరణలు తెచ్చా. ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టిపెట్టాలి. అధికారులు అడ్మినిస్ట్రేషన్ పై శ్రద్ద వహించాలి. లీప్ యాప్ ద్వారా పనివిధానాన్ని మెరుగుపర్చుకోవాలి. గతంలో విజిబిలిటీ లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం విధానానికి లీప్ యాప్ కేంద్రంగా ఉంటుంది. రాష్ట్ర, జిల్లా, మండల, స్కూలు స్థాయిలో ఒకేవిధమైన డేటా ఉండాలి. లక్ష్యసారూప్యత ఉండాలి. డ్యాష్ బోర్డుపై శ్రద్ధపెట్టాలి. ఇదంతా పూర్తయ్యాక పబ్లిక్ డ్యాష్ బోర్డుకు యాక్సెస్ ఇస్తాం. పాల్, ఏఐ బేస్ లెర్నింగ్, ఏఐ ట్యూటర్ త్వరలోనే అమలు చేయబోతున్నాం" అని అన్నారు.

నైతిక విలువలు ముఖ్యం
టెక్నాలజీతోపాటు నైతిక విలువలు చాలా అవసరమని అన్నారు. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారికి కేబినెట్ హోదాతో అడ్వయిజర్ గా పెట్టామని తెలిపారు. ప్రతి శనివారం వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పై దృష్టిపెట్టాలని అన్నారు. ఒక సోషల్ మీడియా పోస్టులో కొడుకు తల్లిని చంపే పరిస్థితి చూశానని, నైతిక విలువల బోధనతో ఇటువంటి ఘటనలను నివారించే అవకాశముందని అన్నారు. విద్యాశాఖపై పవిత్రమైన బాధ్యత ఉందని అన్నారు. జెండర్ సెన్సిటివిటీ కూడా చాలా ముఖ్యమని తెలిపారు. ఉపాధ్యాయులకు ఎక్స్ పోజర్ విజిట్స్ ఏర్పాటు చేస్తున్నామని, యోగా, స్పోర్ట్స్ పై శ్రద్ధ పెడుతున్నామని వెల్లడించారు. స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నామని, శాప్ ద్వారా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెడుతున్నామని అన్నారు. విద్యాశాఖ వద్దని చాలామంది తనను వారించినా సమాజంలో తాను ఆశించిన మార్పు విద్యతోనే సాధ్యమని నమ్మి ఈ శాఖను తీసుకున్నానని అన్నారు. నూరుశాతం ఫలితాలు సాధించినపుడే విద్యాశాఖ మంత్రిగా సంతృప్తి చెందుతానని వ్యాఖ్యానించారు. అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించారు. మెరుగైన ఫలితాలు సాధించాల్సిన పవిత్ర బాధ్యత మనందరిపై ఉందని మంత్రి లోకేశ్ చెప్పారు.

రెండేళ్లలో విద్యావ్యవస్థలో అనూహ్య మార్పులు
హెచ్ఆర్‌డీ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ, పాఠశాల విద్య భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. గత రెండేళ్లలో పాఠశాల విద్యావ్యవస్థలో మునుపెన్నడూ చూడని సంస్కరణలు చూసినట్లు చెప్పారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు. అనేకసార్లు మంత్రి లోకేశ్ రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్షించి దశ, దిశ నిర్దేశించినట్లు చెప్పారు. ఒక్కోసారి ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు నిర్వహించారని తెలిపారు. వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు నిరంతరం చర్చలు జరిపారని అన్నారు.

రెండేళ్లలో విద్యాశాఖలో గుణాత్మకమైన మార్పులు తెచ్చిన మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కఠినమైనప్పటికీ వాస్తవాన్నే చెబుదామని, మంత్రి ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పటివరకు ముందుకు సాగామని పేర్కొన్నారు. కొంతవరకు సఫలీకృతమయ్యామని, ఇప్పుడు మనం సంస్కరణల దశ నుంచి కన్సాలిడేషన్ వైపు వెళుతున్నామని తెలిపారు. ఈ స్థితిలో ఎదుగుతున్న మొక్కను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే వరకు నిర్విరామంగా కృషిచేయాలని అన్నారు. లక్ష్యాలపై క్లియర్ డెడ్ లైన్ పెట్టుకొని జవాబుదారీతనంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి తమీమ్ అన్సారియా, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Spotlight

Read More →