APUrban Development: చిత్తూరుకు మహర్దశ... మంత్రి నారాయణ సమీక్షలో వెల్లడైన కీలక అభివృద్ధి ప్రణాళికలు..!!

AP Urban Development: చిత్తూరు నగరపాలక సంస్థలో మంత్రి నారాయణ కీలక సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, రాబోయే రోజుల్లో చిత్తూరు అభివృద్ధికి చేపట్టబోయే రూ. 82 కోట్ల డ్రైనేజీ పనులు, అమృత్ పథకం టెండర్లు మరియు మే నెలలోపు రాష్ట్రవ్యాప్తంగా చెత్త తొలగింపు లక్ష్యాల గురించి మంత్రి వెల్లడించిన పూర్తి వివరాలు

Published : 2026-04-06 17:55:00

AP Urban Development: రాష్ట్రంలోని మున్సిపాలిటీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ చిత్తూరు నగరపాలక సంస్థలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడిన మంత్రి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని గాలికొదిలేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. సుమారు 10 లక్షల కోట్ల అప్పులతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 153 లక్షల టన్నుల చెత్తను పేరుకుపోయేలా చేశారని మండిపడ్డారు. విశాఖ, గుంటూరు మినహా మిగిలిన చోట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను నిలిపివేసి పర్యావరణానికి కీడు చేశారని, అయితే తమ ప్రభుత్వం మళ్ళీ ఆరు కేంద్రాల్లో వీటిని పునరుద్ధరిస్తోందని వెల్లడించారు.

మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మే నెల నాటికి రాష్ట్రంలోని 153 లక్షల టన్నుల చెత్తను క్లీన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 123 మున్సిపాలిటీల్లో 10 లక్షల ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో పాటు, రూ. 14,000 కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. నిధుల కొరత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌తో అన్ని పథకాలను అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

చిత్తూరు నగర అభివృద్ధికి సంబంధించి మంత్రి కీలక గణాంకాలను వెల్లడించారు. అమృత్ పథకం కింద రూ. 29.7 కోట్లు, అర్బన్ ఇన్ఫ్రా కింద రూ. 53.24 కోట్లతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. అలాగే రూ. 39.21 కోట్లతో మురికినీటి నిర్వహణ పనులు చేపట్టామన్నారు. నగరంలో కచ్చా డ్రైన్ల నిర్మాణానికి మొదటి విడతగా రూ. 82 కోట్లు కేటాయించామని, డంపింగ్ యార్డులోని మిగిలిన చెత్తను తొలగించి 45 రోజుల్లో ప్రాసెసింగ్ ప్లాంట్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్లాన్ అప్రూవల్స్ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆలస్యం చేయకూడదని, పన్నుల వసూళ్లలో లక్ష్యాన్ని చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జగన్ మోహన్, మురళీ మోహన్, జిల్లా కలెక్టర్ సంపత్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత  ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →