Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం!

Kollu Ravindra: ఇంధన పొదుపు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “నో వెహికిల్ డే” కార్యక్రమానికి మచిలీపట్నంలో విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా సైకిల్‌పై ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Published : 2026-05-15 15:18:00

ఇంధన పొదుపులో భాగంగానే నో వెహికిల్ డే..

ప్రధాని, ముఖ్యమంత్రి సూచనల మేరకు సైకిల్‌పై పార్టీ కార్యాయానికి చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర..

ఇంధన పొదుపు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “నో వెహికిల్ డే” కార్యక్రమానికి మచిలీపట్నంలో విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా సైకిల్‌పై ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

శుక్రవారం ఉదయం ఇంటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సైకిల్‌పై చేరుకున్నారు. అనంతరం ఎలక్ట్రిక్ సైకిల్‌పై ఆర్ అండ్ బీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు.

మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఖర్చుల్లో నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇరాన్ – అమెరికా మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచంలో ఆయిల్ కొరత ఏర్పడుతోందని, భవిష్యత్తులో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో ప్రజలకు పలు సూచనలు చేశారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, వంటనూనెల వినియోగంలో కూడా జాగ్రత్త పాటించాలని ప్రధాని సూచించారని చెప్పారు. అదేవిధంగా బంగారం కొనుగోళ్లు, విదేశీ పర్యటనలను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కూడా సూచించారని వెల్లడించారు.

ప్రధాని సూచనల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తమ కాన్వాయ్‌లను తగ్గించుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం నాయకులే ముందుగా పొదుపు చర్యలు ప్రారంభించారని చెప్పారు.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతి శుక్రవారం “నో వెహికిల్ డే” పాటించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే తాము ఈ రోజు సైకిల్‌పై కార్యాలయాలకు వచ్చామని తెలిపారు.

ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని సూచించారు. అవసరమైనప్పుడే కార్లు ఉపయోగించి, మిగిలిన సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.

సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడం ద్వారా ఇంధన ఖర్చులు భారీగా తగ్గుతాయని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోలార్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

“నా దేశం – నా భద్రత” అనే నినాదంతో ప్రతి పౌరుడు పొదుపు అలవాటు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, బంగారం వంటి వినియోగాల్లో నియంత్రణ పాటిస్తే విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇకపై అవసరం ఉన్నప్పుడే కార్లు ఉపయోగించాలని పార్టీ నాయకులకు కూడా సూచించినట్టు చెప్పారు. సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మంచిదే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Spotlight

Read More →