మెగా, అల్లు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ ఇకలేరన్న వార్త సినీ కుటుంబాలనూ, అభిమానులనూ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె వయసు 94 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆగస్ట్ 29వ తేదీ అర్థరాత్రి సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆగస్ట్ 30న మధ్యాహ్నం హైదరాబాద్ కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి.
కనకరత్నమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే మనవళ్లు రామ్ చరణ్, అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ మైసూరులో ‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో ఉండగా, అల్లు అర్జున్ ముంబైలో అట్లీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ వెంటనే షూటింగ్స్ రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్, నాగబాబు ఆదివారం అల్లు కుటుంబానికి సంతాపం తెలియజేయనున్నట్లు సమాచారం.
అల్లు రామలింగయ్య, కనకరత్నమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో కుమారుడు అల్లు అరవింద్, కుమార్తె సురేఖ తెలుగు ప్రజలకు బాగా సుపరిచితులు. అల్లు అరవింద్ పిల్లలు అల్లు అర్జున్, శిరీష్, బాబీ కాగా, సురేఖను మెగాస్టార్ చిరంజీవికి వివాహం చేశారు. వారి పిల్లలు రామ్ చరణ్, సుస్మిత కొణిదెల. ఈ బంధం వల్ల మెగా, అల్లు కుటుంబాలు ఎప్పటికప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తూ వచ్చాయి.

గతంలో అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో కనకరత్నమ్మ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే అల్లు స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అరవింద్ తన తల్లిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి, అల్లు అర్జున్ చేతుల మీదుగా సత్కరించడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. అనారోగ్య కారణాల వల్ల గత కొంతకాలంగా ఆమె మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులందరికీ అండగా నిలిచారు.
కనకరత్నమ్మ మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు అల్లు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మెగా, అల్లు కుటుంబాల మధ్య గతంలో కొన్ని విభేదాలున్నాయని ప్రచారం జరిగినప్పటికీ, ఇలాంటి సందర్భాల్లో వారు ఒకటిగా నిలుస్తున్న తీరు అభిమానులను కదిలిస్తోంది. కనకరత్నమ్మ మరణం సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటు.