విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండలో దుర్గమ్మ ఆలయం, గుణదల కొండతో పాటు గాంధీ కొండ కూడా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థంగా ఈ కొండపై స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించగా, 1964 నవంబర్ 9న నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాలుగేళ్ల తరువాత, 1968లో గాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా, భారత రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ చేతుల మీదుగా 52 అడుగుల ఎత్తైన గాంధీ స్మారక స్థూపం ప్రజలకు అంకితం చేయబడింది. అప్పటి నుండి గాంధీ కొండ విజయవాడలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తూ లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది.
ఇప్పటివరకు గాంధీ కొండపై స్మారక స్థూపం వరకు చేరుకోవడానికి పర్యాటకులు మెట్లద్వారానే చేరుకోవాల్సి వచ్చేది. ఇది వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు కష్టతరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ కొండపైకి సులభంగా చేరుకోవడానికి భారీ లిఫ్ట్ (జంబో లిఫ్ట్) ఏర్పాటు చేయాలని నిర్ణయించి, నిర్మాణ పనులు వేగంగా చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ లిఫ్ట్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. దీంతో గాంధీ కొండకు చేరుకోవడం మరింత సులభతరం అవుతుంది.
లిఫ్ట్‌తో పాటు గాంధీ హిల్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు, గాంధీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు కూడా ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు తొలిసారిగా గాంధీ స్మారక స్థూపం వద్ద నిలబడి విజయవాడ నగర సౌందర్యాన్ని వీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గాంధీ కొండను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పైగా, లిఫ్ట్ పైభాగం నుండి స్మారక స్థూపం వరకు సులభంగా చేరేందుకు ప్రత్యేక ఎలివేటెడ్ పాత్‌వేను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
గాంధీ కొండలో ఇప్పటికే ఘాట్ రహదారి ఉన్నప్పటికీ, అది కొండ పైభాగానికి పూర్తిగా చేరదు. అందువల్ల పర్యాటకులు తప్పనిసరిగా మెట్లద్వారానే ఎక్కాల్సి వచ్చేది. కొత్త లిఫ్ట్ ఏర్పాటుతో ఈ సమస్యను అధిగమించవచ్చు. గాంధీ హిల్ సొసైటీ సౌజన్యంతో నిర్మిస్తున్న ఈ లిఫ్ట్ పర్యాటకుల రాకపోకలకు మైలురాయిగా మారనుంది. విజయవాడకు వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా సందర్శించే గాంధీ కొండ మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. ఇది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, విజయవాడ నగరానికి కొత్త గౌరవాన్ని తీసుకురానుంది.