తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలన అధికారుల (GPO) నియామక ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా VRO, VRAల కోసం రెండో విడత అర్హత పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 2,439 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,734 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
సంబంధిత అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఈ అర్హత పరీక్ష ఫలితాలను ఈ నెల 31లోపు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడతలో 3,454 మందిని ఎంపిక చేశారు. రెండో విడత ఎంపిక అనంతరం మరిన్ని పోస్టులు భర్తీ కానున్నాయి.
రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న గ్రామ పాలన అధికారుల నియామకం ద్వారా గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సంబంధిత సేవలను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో మొత్తం 10,954 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నియామక ప్రక్రియ పూర్తయితే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక GPOని నియమించి, ప్రజలకు తక్షణ సేవలు అందించే దిశగా పాలన మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది.