Krishna River: కృష్ణానదిలో మత్స్యకారుల భారీ బోట్ల ర్యాలీ.. ప్రభుత్వానికి మద్దతు!

Krishna River: అమరావతి పరిసరాల్లో కృష్ణానది ఆదివారం మత్స్యకారుల బోట్లతో సందడిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘మత్స్యకారుల సేవలో’ పథకానికి మద్దతుగా పెద్ద ఎత్తున మత్స్యకారులు బోట్ల ర్యాలీ నిర్వహించారు.

Published : 2026-05-19 12:25:48

‘మత్స్యకారుల సేవలో’ కింద రూ.262 కోట్ల సాయం విడుదల..

వరుసగా రెండో ఏడాది మత్స్యకారులకు ఆర్థిక భరోసా..

అమరావతి పరిసరాల్లో కృష్ణానది ఆదివారం మత్స్యకారుల బోట్లతో సందడిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘మత్స్యకారుల సేవలో’ పథకానికి మద్దతుగా పెద్ద ఎత్తున మత్స్యకారులు బోట్ల ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది మత్స్యకారులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.

వేట నిషేధ కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున సాయం అందిస్తోంది. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల ఆర్థిక సహాయం అందించగా, ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ, తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం వేట నిషేధ సమయంలో కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటోందని చెప్పారు. తమ మద్దతును తెలియజేయడానికే బోట్ల ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు.

ఇవాళ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటలో నిర్వహించే ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలతో సీఎం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, అవసరాలు తెలుసుకోనున్నారు.

రెండేళ్లలోనే ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా మొత్తం రూ.505 కోట్ల సహాయం అందించడంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ మద్దతు తమ జీవితాల్లో కొత్త నమ్మకాన్ని తీసుకొచ్చిందని పలువురు మత్స్యకారులు అభిప్రాయపడ్డారు.

Tags

Spotlight

Read More →