ప్రముఖ సినీ నటి కస్తూరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె భారతీయ జనతా పార్టీ కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ట్రాన్స్‌జెండర్ కార్యకర్త నమితా మారిముత్తు కూడా పార్టీలో చేరారు. నైనార్ నాగేంద్రన్, కస్తూరి మరియు నమితాను సాదరంగా ఆహ్వానించి, పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో కూడా పంచుకున్నారు.
కస్తూరి, మోడల్‌గా రాణించిన క్షణాల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించారు. అలాగే, పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సెలబ్రిటీగా గుర్తింపు పొందారు.
గత సంవత్సరం నవంబర్ 3న చెన్నైలో హిందూ మక్కల్ కచ్చి నిర్వహించిన కార్యక్రమంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. తమిళనాడులో నివసించే తెలుగు మాట్లాడే ప్రజలు తమను తమిళులుగా చెప్పుకుంటున్నారని, కానీ కొన్ని వలస బ్రాహ్మణులను తమిళులుగా అంగీకరించడం లేదని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా, తెలుగు వారు పూర్వకాలంలో రాజుల అంతఃపురాల్లో పరిచారకులుగా పనిచేసిన వారి వారసులని చెప్పడంతో వివాదం తీవ్రమైంది.
ఈ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫెడరేషన్ నేతలు సీఎంకే రెడ్డి, ఆర్. నందగోపాల్ ఫిర్యాదు అందించడం తర్వాత గ్రేటర్ చెన్నై పోలీసులు కస్తూరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రేపినట్టు ఆరోపిస్తూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ వివాదం జరిగిన కొన్ని నెలలకే, కస్తూరి బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.