Education: పేద విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: మంత్రి డోలా!

Education: పేద విద్యార్థుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

Published : 2026-05-29 19:48:00

విద్య ద్వారానే పేదరికంపై విజయం సాధించవచ్చు: మంత్రి డోలా..

గురుకులాలు, హాస్టళ్ల టాపర్లకు నగదు బహుమతులు అందించిన ప్రభుత్వం..

అమరావతి: పేద విద్యార్థుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. విద్య ద్వారానే పేదరికాన్ని జయించవచ్చని, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. చదువు జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని పేర్కొంటూ, అభివృద్ధికి కులాలు అడ్డంకి కాదని, కష్టపడి చదివితే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు.

హాస్టళ్లలో సానిటేషన్, నాణ్యమైన ఆహారం, భద్రత, మెరుగైన వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతి వారం హాస్టళ్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ‘100 డేస్ యాక్షన్ ప్లాన్’ కారణంగా గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాలు సాధించారని కొనియాడారు.

గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలకు సురక్షిత వాతావరణంలో విద్య అందిస్తున్నామని పేర్కొన్న మంత్రి, ఈ ఏడాది అత్యుత్తమ మార్కులు సాధించిన 165 మంది రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు, 132 మంది హాస్టల్ విద్యార్థులను ప్రభుత్వం ఘనంగా సన్మానించిందన్నారు.

విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడించిన మంత్రి, 3.53 లక్షల ఎస్సీ విద్యార్థులకు రూ.917 కోట్లు, 2.51 లక్షల ప్రీ-మెట్రిక్ విద్యార్థులకు రూ.320 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. హాస్టళ్ల మరమ్మతులు, అదనపు మరుగుదొడ్లు, కొత్త భవనాల నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు.

విద్యార్థుల భద్రత కోసం హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, శానిటేషన్ కోసం ప్రత్యేక అవుట్‌సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. హెడ్ ఆఫీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అలాగే ఐఐటీ, నీట్ కోచింగ్ కేంద్రాల సంఖ్యను 3 నుంచి 10కు పెంచామని, కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 187 మంది విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించారని చెప్పారు.

గీతం ఇన్‌స్టిట్యూట్స్ సహకారంతో 600 మంది సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా ఉన్నత విద్య, వసతి, ఫీజులు అందిస్తున్నామని వెల్లడించారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ‘పి-4’ కార్యక్రమం ద్వారా నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వరుసగా రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. జిల్లా స్థాయి టాపర్లను కూడా సత్కరించారు. ఉత్తమ ఫలితాల సాధనలో కృషి చేసిన అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు శాలువాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

మొత్తం 297 మంది విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులు అవార్డులు అందుకున్నారు. అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం నాయక్, APSWREIS కార్యదర్శి వి. ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి, అడిషనల్ డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spotlight

Read More →