71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక విభాగాల్లో పురస్కారాలు దక్కినందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలు ఈ స్థాయిలో గుర్తింపు పొందటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేస్తూ, "భగవంత్ కేసరి" ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం, అలాగే "హనుమాన్" సినిమాకు ఉత్తమ VFX మరియు ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ విభాగాల్లో పురస్కారాలు రావడం తెలుగు పరిశ్రమ విజయం అని అన్నారు.
అలాగే "బేబీ" చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే రాసిన సాయి రాజేశ్‌కు, "బలగం" చిత్రానికి ఉత్తమ గీత రచయితగా ఎంపికైన కాసర్ల శ్యామ్‌కు, "గాంధీ తాతచెట్టు" చిత్రంలో నటించి ఉత్తమ బాలనటిగా ఎంపికైన సుకృతివేణి బండ్రెడ్డికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ప్రతిభకు ఇది గర్వకారణంగా పేర్కొంటూ, ఇలాంటి ఘనతలు మరిన్ని రావాలన్నారు.