భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకింగ్ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు మరో కీలక ముందడుగు వేసింది. వినియోగదారులు చెక్కుల ద్వారా చేసే లావాదేవీలు ఇప్పటివరకు రెండు లేదా మూడు రోజుల పాటు సమయం తీసుకునేవి. కొన్ని సందర్భాల్లో అది ఇంకా ఎక్కువ రోజులు పట్టేది. కానీ ఇక ఆ ఇబ్బంది తీరనుంది. RBI తీసుకొస్తున్న కొత్త విధానం ప్రకారం చెక్కు క్లియరెన్స్ ఇప్పుడు గంటల వ్యవధిలోనే పూర్తవనుంది. అంటే మీరు చెక్ డిపాజిట్ చేసిన అదే రోజు డబ్బు మీ ఖాతాలో చేరే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు చెక్కులు బ్యాచ్‌ల వారీగా క్లియర్ చేయబడేవి. కానీ ఇకపై ఆ విధానానికి గుడ్‌బై. RBI పరిచయం చేస్తున్న “నిరంతర చెక్ క్లియరెన్స్ సిస్టమ్” (Continuous Clearing System) ప్రకారం, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు స్వీకరించే అన్ని చెక్కులను వెంటనే స్కాన్ చేసి సెంట్రల్ క్లియరింగ్ హౌస్‌కు పంపిస్తారు. ఆ క్లియరింగ్ హౌస్ చెక్ ఇమేజ్‌లను నిరంతర ప్రాతిపదికన సంబంధిత బ్యాంకులకు పంపిస్తుంది. డ్రాయీ బ్యాంకుకు చెక్ ఇమేజ్ అందిన తర్వాత సాయంత్రం 7 గంటల వరకు ఆ బ్యాంక్ చెక్‌ను క్లియర్ చేయాలా వద్దా అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా చెక్కు రియలైజేషన్ సమయం రోజుల్లో కాకుండా గంటల్లోనే పూర్తవుతుంది.
కేవలం వేగం మాత్రమే కాదు, భద్రతపైన కూడా RBI ఎక్కువ దృష్టి పెట్టింది. రూ.50,000కు పైబడిన చెక్కుల కోసం “పాజిటివ్ పే సిస్టమ్” తప్పనిసరి చేసింది. ఇందులో కస్టమర్లు చెక్ వివరాలను — అకౌంట్ నంబర్, చెక్ నంబర్, తేదీ, మొత్తం, లబ్ధిదారుడి పేరు — ముందుగానే బ్యాంకుకు పంపాలి. ఈ సమాచారం చెక్ జమ చేయడానికి కనీసం 24 గంటల ముందు ఇ-మెయిల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా సమర్పించాలి. బ్యాంక్ ఆ వివరాలను ధృవీకరించి సరిపోతే మాత్రమే చెక్ క్లియర్ అవుతుంది. వివరాలు సరిపోలకపోతే చెక్ తిరస్కరించబడుతుంది. రూ.5 లక్షలకుపైగా చెక్కుల కోసం ఈ విధానం తప్పనిసరి కాగా, రూ.50,000 పైగా చెక్కులకు కూడా వినియోగించాలని RBI సూచిస్తోంది.
ఈ నూతన చెక్ క్లియరెన్స్ వ్యవస్థను RBI రెండు దశల్లో అమలు చేస్తోంది. మొదటి దశ ఇప్పటికే అక్టోబర్ 4, 2025 నుంచి ప్రారంభమైంది. రెండో దశ 2026 జనవరి 3 నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పుతో చెక్కుల ద్వారా జరిగే లావాదేవీలు మరింత వేగవంతం అవడమే కాకుండా, భద్రతపరమైన మోసాలను కూడా నివారించవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఇది ఒక పెద్ద సాంకేతిక సంస్కరణగా మారనుంది. కస్టమర్లు తమ చెక్ వివరాలను ఖచ్చితంగా నింపి, పాజిటివ్ పే సిస్టమ్ ఉపయోగిస్తే ఈ కొత్త విధానం ద్వారా పూర్తి ప్రయోజనం పొందవచ్చు.